తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సమర్పించడానికి సర్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి , 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. శుక్రవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈసారి బడ్జెట్‌లో ఆరు సరికొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు , యువతకు పెద్దపీట
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బడ్జెట్ కేటాయింపుల్లో కీలక మార్పులు చేశారు. ఇందులో ప్రధానంగా 'యంగ్ ఇండియా కిట్స్' (Young India Kits) పథకం హైలైట్‌గా నిలవనుంది. సంక్షేమ హాస్టళ్ల నుండి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల వరకు చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను అందజేయనున్నారు. అలాగే, ఎన్నికల హామీలో భాగంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ పథకాన్ని కూడా ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.
రైతులు , మహిళలకు ప్రాధాన్యత
తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2026) లో ఈసారి మహిళలు, రైతులు , యువతకు అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. పాల ఉత్పత్తి చేసే రైతులకు రాయితీపై పశువుల సరఫరా చేసే పథకాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేవలం ప్రస్తుత అవసరాలే కాకుండా, దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్య, వైద్యం , నైపుణ్యాభివృద్ధి (Skill Development) రంగాలకు భారీగా నిధులు కేటాయించనున్నారు. ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా మహిళా సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయనున్నారు.
మూడవ బడ్జెట్.. భారీ బాధ్యత!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడవ బడ్జెట్ ఇది. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై ఉంది. అందుకే, పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి భట్టి విక్రమార్క రంగాల వారీగా కేటాయింపులు , అంచనాలను ఖరారు చేశారు.
తెలంగాణ రైజింగ్ విజన్ 2047
2047 నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శుక్రవారం వెలువడనున్న పూర్తి బడ్జెట్ వివరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి వ్యాపారవేత్తల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications