Night Economy: ఆర్థిక అంశాల్లో సమయానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే 'టైమ్ వాల్యూ ఫర్ మనీ' పేరిట ఓ గొప్ప సిద్ధాంతం ప్రాచుర్యలోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టిన కార్పొరేట్ కంపెనీలు రాత్రిళ్లను సైతం ప్రొడక్టివ్‌గా మార్చేందుకు నైట్ షిఫ్ట్స్ పేరిట ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. తద్వారా తమ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుచుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదే విషయంపై దృష్టి సారించింది. హైదరాబాద్ HMDA పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు, జీహెచ్‌ఎంసీని విలీనం చేస్తూ CM రేవంత్ రెడ్డి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ప్లాన్‌ను రూపొందించారు. హై-టెక్ సిటీ సహా పలు నిర్దిష్ట ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు, తినుబండారాల షాపుల ద్వారా రాత్రిపూట ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే బార్లు మరియు పబ్బులకు మాత్రం ఈ ప్రణాళిక నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం అనుమతించిన గంటల కంటే ఎక్కువగా తెరిచి ఉంచకూడదని భావిస్తున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు, రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా రాత్రిపూట ఆర్థిక వ్యవస్థను పుష్ చేయాలని అధికారులను CM కోరారు. కొన్ని చోట్ల నైట్ బజార్ల ప్రతిపాదనలపైనా కసరత్తు చేయాలని ఆదేశించారు.
రాత్రి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని అధికారులు తెలిపారు. చార్మినార్ మరియు గోల్కొండ వంటి ప్రాంతాలలో పర్యాటకం ప్రమోషన్‌కు కూడా ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. నైట్ ఎకానమీ ఆలోచన గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే పురుడుపోసుకుంది. 10 వేల వార్షిక రుసుముతో 24X7 షాపులు, రెస్టారెంట్లు నిర్వహణకు అనుమతిస్తూ కార్మిక శాఖ GO కూడా జారీ చేసింది.
బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అరడజను కంపెనీలు మాత్రమే 25 నైట్ అవుట్‌లెట్‌లకు అనుమతిని కోరడం ద్వారా ఆసక్తిని కనబరిచాయి. టాటా స్టార్‌బక్స్ 8 శాఖలతో పాటు ఫలక్‌నుమాలోని రెడ్ రోజ్ సూపర్ మార్కెట్ కోసం అభ్యర్థించింది. అయితే నైట్ ఎకానమీ ప్లాన్ అనేక సమస్యలతో ముడిపడి ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా మద్యపానంతో కూడిన హింస, సంఘ వ్యతిరేక ప్రవర్తన సహా హోటళ్లు మరియు రెస్టారెంట్లలో శాంతిభద్రతల సమస్యలపై పోలీసు శాఖ ఆందోళన చెందుతోంది.


Click it and Unblock the Notifications