Bangalore Water crisis: సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మంచి శాలరీలు, సౌకర్యాల కోసం కంపెనీలు మారుతుంటారు. ఇతర ప్రాంతాలకు, కుదిరితే విదేశాలకు వలస వెళుతుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ నగరం బెంగళూరులో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సిటీలో నివసించే టెక్కీలు క్రమంగా సొంతూళ్లకు వెళుతున్నారు. ఇది ఏ కరోనా లాక్‌డౌన్ వల్లో లేదా మరే ఇతర వైరస్‌ల వల్ల కాదు.
దేశాభివృద్ధిలో IT రంగం పాత్ర చాలా కీలకం. అటువంటి సెక్టార్‌కు బెంగళూరు మకుటంలేని మహానగరంగా వెలుగొందుతోంది. అయితే నీటి కష్టాల వల్ల ఈ నగరం తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో టెక్కీలు ఇంటిబాట పడుతున్నారు. విద్యార్థులతో సహా పలువురు ఇతర రంగాల ఉద్యోగులు కూడా కరోనా వేళ మాదిరిగా వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా CMకు విజ్ఞప్తి పోస్టులు పెడుతున్నారు.

గత 15-20 ఏళ్లుగా నగరంలో నివసిస్తున్న వారు తామెప్పడూ ఈ స్థాయిలో నీటి కొరత చూడలేదని వాపోతున్నారు. ఇది కాస్తా ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్న వారిపై నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది. ఇక 20-40 వేలు వెచ్చించి అద్దెలకు ఉండేవారయితే అద్దెలకు భారీ మొత్తం ఖర్చు పెట్టినా నీటి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత ఊళ్లకు వెళ్లడం లేదా నగరానికి దూరంగా అద్దెకు నివసించడానికి సిద్ధపడుతున్నారు.
ఇప్పటివరకు బోర్లపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భూగర్భ జలాలు సైతం ఇంకిపోవడం, కొత్త కనెక్షన్లు వెల్లువెత్తడంతో విపత్కర పరిస్థితులు నెలకొన్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రి షిఫ్ట్ లో పనిచేస్తూ ఉదయం నిద్రపోయేవారు ఇబ్బంది మరోలా ఉంది. నీరు వచ్చే టైంలో ఎదురుచూడలేక, నిద్రను ఆపుకోలేక నానా పాట్లు పడుతున్నామని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications