Wipro News: ఇటీవల కాలంలో దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో గందరగోళం నెలకొంది. ఒకపక్క వ్యాపారంలో అస్థిరతలు, తగ్గిన ఆదాయాలు ప్రాజెక్టులతో సతమతమౌతున్న వేళ కీలక స్థానాల్లోని వ్యక్తుల రాజీనామాలు కోలుకోని దెబ్బ కొడుతున్నాయి.
ప్రధానంగా ఇన్ఫోసిస్, విప్రో నుంచి చాలా కాలంగా పనిచేస్తున్న అగ్రశ్రేణి నాయకులు, ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నిజెంట్‌లో చేరటం పెద్ద వివాదానికి తెరతీసింది. నాన్-కాంపిటేట్ నిబంధనలను పాటించటం అతిక్రమించి చాలా మంది ప్రత్యర్థి సంస్థల్లో చేరటంపై టెక్ దిగ్గజాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే వీటిని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలకు సైతం దిగాయి. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన మాజీలపై విప్రో కోర్టును ఆశ్రయించింది.

వాస్తవానికి నాన్-కాంపిటేట్ నిబంధనల ప్రకారం విప్రోలో పనిచేసి మానేసిన ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడిన 12 నెలల వరకు ఉద్యోగంలో చేరకూడని 10 కంపెనీల జాబితాను బహిర్గతం చేసింది. ఈ జాబితాలో యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, డెలాయిట్, డీఎక్స్‌సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐబీఎమ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రాలు ఉన్నాయి. విప్రో ఎగ్జిక్యూటివ్‌లు వారి చివరి పని దినం నుంచి 12 నెలలలోపు చేరడం నిషేధించబడ్డారు.
అయితే మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్, SVP మొహమ్మద్ హక్ నిబంధనలు పాటించకుండా ఏడాదిలోపే కాగ్నిజెంట్‌లో చేరటాన్ని తప్పుపడుతూ దావా వేసింది. ఈ క్రమంలో జతిన్ నుంచి 18 శాతం వడ్డీతో కలిపి ఏడాది కాలానికి రూ.25.15 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని కోరింది. ఇదే క్రమంలో మొహమ్మద్ హక్ రహస్య సమాచారాన్ని కలిగి ఉన్నారని విప్రో ఆరోపించింది. అయితే ప్రస్తుతం రెండు కేసులు మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయబడ్డాయి. కొత్త కంపెనీతో రహస్యాలు పంచుకుంటే హాని కలిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది.


Click it and Unblock the Notifications