Variable Pay: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టీసీఎస్.. వేరియబుల్ పే భారీ కోత, వరుసగా రెండోసారి..
TCS News: కొన్ని రోజుల కిందట దేశంలోని టాప్ ఐటీ దిగ్గజంగా ఉన్న టీసీఎస్ తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అయితే తాజాగా కంపెనీ ఉద్యోగులకు వేరియబుల్ వేతనాల విషయంలో పెద్ద షాక్ ఇచ్చినట్లు వెల్లడైంది. వరుసగా కంపెనీ ఇలా చేయటంపై ఉద్యోగులు సైతం ఆవేదన చెందుతున్నారు.
టాటాలకు చెందిన ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్‌ను వరుసగా రెండవ త్రైమాసికంలో తగ్గించిందని మనీకంట్రోల్ నివేదించింది. ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా పనితీరు చూపించినప్పటికీ వరుసగా రెండవ త్రైమాసికంలో వేరియబుల్ పే కట్ అందించినట్లు నివేదించబడింది. వాస్తవానికి సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో కూడా కొందరు ఉద్యోగులకు వేరియబుల్ అలవెన్సులను కంపెనీ 20 నుంచి 40 శాతం మాత్రమే చెల్లించిందని వెల్లడైంది.
అలాగే క్యూ2లో కొందరు ఉద్యోగులకు వేరియబుల్ పే పూర్తిగా చెల్లింపు ఎత్తివేయబడింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఒక ఉద్యోగి తనకు రూ.50-55 వేలు వేరియబుల్ పే వాస్తవానికి రావాల్సి ఉండగా గత త్రైమాసికంలో ఇందులో సగం మాత్రమే చెల్లించబడిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో కేవలం నాల్గవ వంతు మాత్రమే కంపెనీ అందించిందని బయటపెడ్డారు. కంపెనీలోని మరో వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 70 శాతం ఉద్యోగులకు టీసీఎస్ 100 శాతం వేరియబుల్ వేతనాన్ని అందించిందని తేలింది. అయితే ప్రధానంగా జూనియర్ స్థాయి ఉద్యోగులకు ఫుల్ అమౌంట్ అందినట్లు వెల్లడైంది.
సీనియర్ ఉద్యోగులకు వారి వ్యాపార యూనిట్ పనితీరుకు వేరియబుల్ పే లింక్ చేయబడి ఉంటుంది కాబట్టి వారు తక్కువగా పే అందుకున్నట్లు చెప్పుకోవచ్చు. అయితే కంపెనీ మాత్రం ఈ ఊహాగానాలపై తాము స్పందించబోమని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే గత సంవత్సరం టీసీఎస్ ఉద్యోగుల ఆఫీసు హాజరును వేరియబుల్ వేతనానికి లింక్ చేసింది. ఆ రూల్స్ ప్రకారం పూర్తి వేరియబుల్ పే పొందటానికి ఉద్యోగుల కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు కలిగి ఉండాల్సి ఉంది.
అలాగే 75-85 శాతం ఆఫీస్ హాజరు కలిగి ఉన్న టెక్కీలు వేరియబుల్ పేలో 75 శాతం పొందుతారని.. 60-75 శాతం హాజరు ఉన్న ఉద్యోగులు వేరియబుల్ పేలో 50 శాతం మాత్రమే అందుకుంటారని కంపెనీ ముందుగానే స్పష్టం చేసింది. ఇక చివరిగా ఆఫీసు హాజరు 60 శాతం కంటే తక్కువ కలిగిన ఉద్యోగులకు త్రైమాసికంలో అందించి వేరియబుల్ పే పొందటానికి అర్హులు కాదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ కూడా ఉద్యోగులు అందుకుంటున్న పే మెుత్తంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ హర్షించదగిన విషయం ఏమిటంటే ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీలతో పోల్చితే టీసీఎస్ వేతన పెంపులను సమయానికి అందిస్తూ మెరుగైన స్థానంలో ఉంది.



Click it and Unblock the Notifications