Infosys News: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఫైన్.. రెండోసారి ఎదురుదెబ్బ.. ఎందుకంటే..??
Infosys News: తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన ఐటీ సేవలను అందించటంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు అద్భుతమైన గుర్తింపును గడించాయి.
తాజాగా బుధవారం నాడు దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని సీటెల్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి 1,764.84 డాలర్ల పెనాల్టీ నోటీసులను అందుకున్నట్లు ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించింది. అయితే అక్కడి రూల్స్ పాటించటంలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఇది జరిగినట్లు వెల్లడైంది.

వివరాల్లోకి వెళితే జనవరి 01, 2021 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య కాలంలో అమెరికాలోని స్థానిక పేరోల్ పన్నులను తక్కువగా ఇన్ఫోసిస్ చెల్లించినందుకు గాను జరిమానా విధించబడినట్లు కంపెనీ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలియజేస్తుంది. అయితే దీని వల్ల కంపెనీ ఆర్థిక, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
దీనికి ముందు గత నెలలో టెక్ దిగ్గజం ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి పన్ను చెల్లింపుల్లో లోటుపై జరిమానాకు సంబంధించిన నోటీసులను అందుకుంది. అయితే ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ అత్యంత స్వల్పంగా 76.92 డాలర్లను జరిమానాగా విధించింది. అయితే పొరపాటున చేసిన దరఖాస్తు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో నేడు ఇన్ఫోసిస్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభంతో రూ.1,468.45 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications