IT News: టెక్కీలకు శుభవార్త చెప్పిన Infosys.. ఉద్యోగుల ఖాతాలో బోనస్ అమౌంట్, ఎంతంటే?
Infosys Performance Bonus: దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించటంతో పాటు తమ ఉద్యోగులకు అందించాల్సిన పర్ఫార్మెస్ బోనస్ లేదా వేరియబుల్ పే వంటి వాటికి సంబంధించి కీలక ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో వీటి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగలు సైతం తమకు ఎంత మెుత్తంలో డబ్బు వస్తుందనే విషయాన్ని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త వెలువడింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన సంస్థలో పనిచేస్తున్న జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు సగటున 85% బోనస్‌ను అందించాలని నిర్ణయించింది. డిసెంబర్ మాసంలో జమయ్యే నవంబర్ జీతంతో బోనస్‍ను కలిపి విడుదల చేయబడుతుందని కంపెనీ టెక్కీలకు పంపిన మెయిల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఉద్యోగుల పనితీరు ఆధారంగా వ్యక్తిగత చెల్లింపు శాతం మారుతుందని ముందుగానే స్పష్టం చేసింది.

ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన మెయిల్ పరిశీలిస్తే.. రెండవ త్రైమాసికంలో మార్కెట్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ విస్తృత వృద్ధితో బలమైన పనితీరు కనబరిచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ విజయం ఉద్యోగుల అచంచలమైన అంకితభావానికి, మార్జిన్ పనితీరుపై కంపెనీ వ్యూహాత్మక దృష్టికి, క్లౌడ్, జనరేటివ్ AIలో ఇన్ఫోసిస్ నైపుణ్యానికి నిదర్శనంగా పేర్కొంది. సామర్థ్యాలను పెంపొందిచంటంతో పాటు ఖాతాదారులకు అసాధారణమైన విలువను అందించడంలో ఉద్యోగుల నిబద్ధత కీలకంగా ఉందని కంపెనీ ప్రశంశించింది. భవిష్యత్తు కోసం అంతులేని అవకాశాలతో సంస్థ ఎదురుచూస్తోందని ఉద్యోగులకు పంపిన నోట్ ప్రకారం వెల్లడైంది.
సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపధికన 4.7% పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ ఆదాయం 5.1% పెరిగి రూ.40,986 కోట్లుగా నమోదైంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో డిమాండ్ పెరుగుదల కారణంగా వ్యాపార వృద్ధి నమోదైంది.
ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల వర్గీకరణలు E0-E2 వరకు ఫ్రెషర్‌ల నుండి సాంకేతిక నాయకుల వరకు విస్తరించి ఉంటాయి. అయితే E3-E6 మధ్య స్థానాల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌లు, వైస్ ప్రెసిడెంట్‌ల వంటి మధ్య స్థాయి స్థానాలను కవర్ చేస్తుంది. సీనియర్-స్థాయి ఉద్యోగులు E7 లేదా అంతకంటే ఎక్కువ కేటగిరీ కిందికి వస్తారు. మునుపటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సగటున 80% బోనస్‌ను విడుదల చేసింది. జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ బలమైన పనితీరును ప్రతిబింబిస్తూ తాజా చెల్లింపులు గడచిన ఏడాది ఇదే కాలం కంటే ఎక్కువగా ఉండటం ఉద్యోగుల్లో సంభావ్య అసంతృప్తిని తగ్గిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ముందు మార్చి త్రైమాసికంలో కేవలం 60 శాతం బోనస్ మాత్రమే ప్రకటించబడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications