IT News: కాగ్నిజెంట్ సీరియస్ నిర్ణయం.. కంగారులో టెక్కీలు.. TCS, Wipro తర్వాత
Cognizant News: నెలలు గడుస్తున్న కొద్ది అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు టెక్ రంగంలో దిగజారుతున్నాయి. ఈ పరిస్థితులు పరోక్షంగా దేశంలోని టెక్ కంపెనీలు కొత్త నియామకాలను పూర్తిగా నిలిపివేశాయి.
దేశీయ ఐటీ సేవల కంపెనీలు కొత్త ప్రాజెక్టులు దాదాపు తగ్గిపోవటంతో పైప్‌లైన్‌లో ఉన్న వాటిని కాపాడుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తూ పనిలో నాణ్యతను పెంచే పనిలో ఉన్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తొలగిస్తున్నట్లు 2023లోనే ప్రకటించాయి. టీసీఎస్ ఏకంగా లక్షల మంది ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనని చెప్పగా.. హైక్స్ కూడా దీనికి లింక్ చేసింది.

తాజాగా ఈ బాటలోనే మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులు ఇకపై వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని మెయిల్ ద్వారా సమాచారం పంపింది. తాజాగా ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాలను చూస్తుంటే టెక్ కంపెనీలు ఎంత ఒత్తిడిలో వ్యాపారాలను కొనసాగిస్తున్నాయో అర్థమౌతోంది. యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఇండియాలో 2.45 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగ్నిజెండ్ భారతీయ వ్యాపార విభాగంలోని ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనని సీఈవో రవి కుమార్ మెమో ద్వారా ఉద్యోగులకు తెలిపారు.
కాగ్నిజెంట్ నిర్ణయంతో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్థి పలికింది. కంపెనీ ఉద్యోగుల మధ్య మెరుగైన సహకారాన్ని పెంపొందించటంతో పాటు, కంపెనీ సంస్కృతిపై అవగాహన, టీమ్ బిల్డింగ్ పెంపొందించటం తాజా నిర్ణయం వెనుక కారణంగా చెబుతోంది. అయితే చాలా మంది టెక్కీలు ఫ్లెక్సిబిలిటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాల్లో స్వేచ్ఛను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత టెక్కీలను ఆకట్టుకునేందుకు కంపెనీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా టైర్-2 నగరాల్లో తమ ఆఫీసులను ఓపెన్ చేస్తున్నాయి. కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకొస్తున్నందున పనితీరు మెరుగుపడుతుందని పరిశోధనా సంస్థ అన్‌ఎర్త్‌ఇన్‌సైట్ వ్యవస్థాపకుడు గౌరవ్ వాసు అన్నారు. రానున్న రెండు-మూడు త్రైమాసికాల్లో టెక్ కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ సైతం మెరుగుపడి సానుకూల ప్రభావాన్ని చూస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications