IT News: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా టెక్కీలు..? ఈ దిగ్గజ ఐటీ కంపెనీ బెస్ట్..!
Work From Home: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో వ్యాపారాలు చేస్తున్న చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఈ వార్తతో సంతోషంగా లేరు. ఆఫీసులకు వారంలో కొన్నిరోజులైనా రావాల్సిందేనని తేల్చి చెప్పాయి.
ఈ పరిస్థితిలో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచటమే లక్ష్యంగా టెక్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. అయితే అనేక కంపెనీల మాదిరిగా కాకుండా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనంటూ బలవంతం చేయటం లేదని వెల్లడైంది. సోషల్ క్యాపిటల్ ప్రాముఖ్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో రవికుమార్ వెల్లడించారు. వ్యాపారాన్ని తిరిగి వృద్ధి బాటలో ఉంచడానికి తమ వద్ద తగినంత మంది ఫ్రెషర్లు ఉన్నారని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్‌లోని ఫ్లెక్సిబిలిటీ వాస్తవానికి ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో కొనసాగించడంలో, కొత్త మహిళా ఉద్యోగులను చేర్చుకోవడంలో సహాయపడుతుందని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. భారతదేశంలో పనిచేస్తున్న ప్రముఖ IT సేవల కంపెనీల్లో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించుకోవటంలో చాలా చురుకుగా ఉంది.
కంపెనీ పెద్ద నగరాల్లో 80 వేల సీటింగ్ కెపాసిటీని తగ్గించిందని ఇన్వెస్టర్ల సమావేశంలో సీఈవో వెల్లడించారు. దీనిలో కొంత భాగాన్ని టైర్-2 నగరాలకు మార్చాలని చూస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ తన సిబ్బంది, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా కంపెనీ నిర్వహణ వ్యయ మార్జిన్‌ను పెంచుకోవాలని చూస్తోంది. దీని ద్వారా సీఈవో రవికుమార్ దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన పొదుపు పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా మరోపక్క టెక్ దిగ్గజం గూగుల్ ఆన్ క్యాంపస్ హోటల్ ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చేలా ఆకర్షించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications