IT news: IT కంపెనీలు ఒక్కొక్కటీ Q4 ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. టెక్ మహీంద్రా సైతం ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇతర సంస్థల మాదిరిగానే ఇది కూడా మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను 1,125 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కానీ గతేడాది నివేదించిన 1,545 కోట్లతో పోలిస్తే 27 శాతం క్షీణత నమోదు చేసింది.
కంపెనీ తన కార్యకలాపాల ద్వారా 13 వేల 718 కోట్లు ఆర్జించినట్లు ప్రకటించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఫ్లాట్ గా మరియు సంవత్సరానికి 13 శాతం పెరుగదల నమోదు చేసింది. రెవెన్యూలో కేవలం 0.3 శాతం పెరుగుదల మాత్రమే అందుకోగలిగింది. పన్ను అనంతర లాభం సీక్వెన్షియల్ ప్రాతిపదికన 3 శాతం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశారు. అయితే ఏటా 11 శాతం క్షీణించి చివరకు 1,336 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సంవత్సరానికి 14 శాతం మరియు త్రైమాసికంలో 0.5 శాతం పెరిగి 13 వేల 809 కోట్లకు వెళ్లింది.

టెక్ మహీంద్రా ఆపరేటింగ్ మార్జిన్ విషయంలో పెద్ద ఎత్తున క్షీణత నెలకొంది. త్రైమాసికంలో EBIT మార్జిన్ 12 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేయగా.. అందుకు వ్యతిరేకంగా 9.6 శాతంగా నమోదైంది. ఉద్యోగుల సంఖ్యలో గత క్వార్టర్ తో పోలిస్తే దాదాపు 5 వేల మంది తగ్గి లక్షా 52 వేల 400 మందికి చేరినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొంది. మార్చి 31, 2023 నాటికి నగదు ప్రవాహం 7 వేల 435 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

'తరువాతి తరం సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా FY24లో వ్యాపారాలను చురుగ్గా ఉంచాల్సిన అవసరాన్ని మేము చూస్తున్నాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లో, మా కస్టమర్ బేస్ ద్వారా పోటీతత్వంతో ఆధిపత్యం చెలాయించడంపై దృష్టి పెడుతున్నాము' అని టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CP గుర్నానీ తెలిపారు. స్థిరమైన డివిడెండ్ విధానం ద్వారా వాటాదారులకు నగదు రూపేణా తిరిగి ఇవ్వడం కొనసాగిస్తున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రోహిత్ ఆనంద్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications