అమెరికా సహా విదేశాల్లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులను భారత ఐటీ కంపెనీలు వెనక్కి తీసుకువస్తున్నాయి. ప్రత్యేక విమానాల్లో వారిని ఇళ్లకు చేరుస్తున్నాయి. కరోనా మహమ్మారి, షట్ డౌన్ కారణంగా వీసా గడువు ముగిసి అమెరికాలో నిలిచిపోయిన 200 మందికి పైగా ఉద్యోగులను, వారి కుటుంబాలను గత వారం ఇన్సోసిస్ భారత్ తీసుకు వచ్చింది. తాజాగా మరో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కూడా ప్రత్యేక విమానంలో ఉద్యోగులను తరలించింది.
ఉద్యోగుల ఆనందం.. అభినందన
ఈ విమానం ఉద్యోగులను తీసుకొని 13వ తేదీన డల్లాస్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. 14న హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ కంపెనీ ఉద్యోగుల సేఫ్టీ కోసం చేస్తున్న ప్రయత్నాల పట్ల టెక్ మహీంద్రా ఉద్యోగులు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా అభినందించారు. 'మా కంపెనీ ఉద్యోగుల భద్రత కోసం ఆలోచిస్తుందని, అందుకే మేం కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో నవ్వుతూ ఇంటికి వెళ్తున్నామని ఓ ఉద్యోగిని ట్వీట్ చేశారు.
ఆ భావోద్వేగాన్ని ఏవీ భర్తీ చేయలేవు
అమెరికాలో చిక్కుకుపోయిన 210 మంది ఉద్యోగులు, కుటుంబాలను అమెరికా నుండి చార్టర్డ్ విమానంలో ఇండియాకు తీసుకు వస్తున్నట్లు మరొక ఉద్యోగి ట్వీట్ చేశారు.
ఇంటికి రావడం, సురక్షితంగా ఉన్నామనే భావన.. ఈ భావోద్వేగాన్ని ఏవీ భర్తీ చేయలేవని, ముఖ్యంగా కరోనా-లాక్ డౌన్ కాలంలో.. అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్ చేశారు. మా సహచరులు, వారి కుటుంబాలు ఇంటికి తిరిగి వస్తున్నారని, వారిని ఇంటికి తిరిగి తీసుకు వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంతకుముందు కరోనా పాజిటివ్ సోకిన వారికి స్పెషల్ లీవ్ కేటగిరీని ఇంట్రొడ్యూస్ చేసినట్లు కూడా గుర్నానీ ట్వీట్ చేశారు.
కరోనా కష్టకాలంలో ఈ కంపెనీకి చెందిన 8 నుండి 10 శాతం ఉద్యోగులు ఆఫీస్ నుండి పని చేస్తున్నారు. పోస్ట్-కోవిడ్ తర్వాత ఇది 25 శాతం నుండి 30 శాతం ఉంటుందని చెబుతున్నారు.

అమెరికా నుండి హైదరాబాద్‌కు తరలింపు
కరోనా లాక్ డౌన్ వల్ల 210 మంది సిబ్బంది, వారి కుటుంబం అమెరికాలో చిక్కుకుపోయింది. వారిని హైదరాబాద్ తీసుకు వస్తున్నట్లు టెక్ మహీంద్రా నిన్న వెల్లడించింది. వీరంతా అమెరికాలోని డల్లాస్, ఫోర్ట్ వర్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంటారని వెల్లడించింది. సిబ్బంది భద్రతకు తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా అన్ని విధాలుగా వారి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ, అవసరమైన మద్దతు ఇస్తున్నట్లు ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.


Click it and Unblock the Notifications