Hyderabad Real Estate: విశ్వనగరం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అందనంత ఎత్తుకు ఎదిగిపోతోంది. ఇటీవల కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంటే భాగ్యనగరంలో ఉన్న భూమి బంగారం లెక్క అన్నమాట. ఇంతటి మహర్దశ కలిగిన నగరంలో ప్రముఖ IT సంస్థకు చెందిన 103 ఎకరాల భూమి చేతులు మారింది.
హైదరాబాద్ బహదూర్‌పల్లిలోని తన 103 ఎకరాల భూమిని 535 కోట్లకు టెక్ మహీంద్రా విక్రయించింది. స్థలంతో పాటు ఇందులోని బిల్డింగులు కూడా కొనుగోలు చేసే పార్టీకి ఇచ్చేందుకు సంస్థ యాజమాన్యం అంగీకరించింది. 1.26 మిలియన్ స్క్వేర్ ఫీట్ల బిల్ట్-అప్ ఏరియాతో కూడిన 17 భవనాలు ఈ డీల్ ద్వారా మహీంద్రా యూనివర్సిటీకి అందనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన నగదు లావాదేవీలు పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

భూమి విక్రయ ఖరీదుతో పాటు పన్నులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కన్వర్షన్ చార్జీలు కూడా విడతల వారీగా అందనున్న 535 కోట్లలో భాగమే. ఇక ఈ నాలుగేళ్ల వ్యవధికిగాను 8.2 శాతం చొప్పున వడ్డీ టెక్ మహీంద్రా పొందనుంది. సమాజాభివృద్ధి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా ఓ స్వతంత్ర సంస్థగా మహీంద్రా యూనివర్సిటీ ఎదగడమే తమ లక్ష్యంగా ఈ సేల్ జరుగుతున్నట్లు కంపెనీ తన ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం మహీంద్రా యూనివర్సిటీ ఏర్పాటైంది. టెక్ మహీంద్రాకు సంబంధించిన భూములు మరియు భవనాల్లో దీన్ని స్థాపించారు. మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ యూనివర్సిటీకి స్పాన్సరింగ్ బాడీగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు విక్రయించిన భూములు లేదా భవనాల్లో ఇకపై ఎటువంటి కంపెనీ కార్యకాలాలు నిర్వహించబడవని IT దిగ్గజం స్పష్టం చేసింది. ఈ డీల్ సంస్థ బిజినెస్ ఆపరేషన్స్ పై ఎటువంటి ప్రభావం చూపదని వివరించింది.


Click it and Unblock the Notifications