ఏఐ దెబ్బకు 1.23 లక్షలకు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు.. టెక్ ఇండస్ట్రీలో ముదురుతున్న ఉద్యోగ సంక్షోభం..
ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల కోత (Layoffs) పరంపర తీవ్రరూపం దాల్చింది. 2026 సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం మిగిలి ఉండగానే, గ్లోబల్ టెక్ రంగంలో చోటుచేసుకున్న లేఆఫ్స్ సంఖ్య గత ఏడాది మొత్తం నమోదైన గణాంకాలను దాటేసి ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కంపెనీలు తమ మూలధనాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నూతన సాంకేతిక రంగా పరిధిలోకి వేగంగా మళ్లిస్తూ, ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ భారీ శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాయి.
ఉద్యోగ కోతలను విశ్లేషించే ప్రముఖ అంతర్జాతీయ పోర్టల్ Layoffs.fyi తాజా డేటా ప్రకారం.. 2025 క్యాలెండర్ ఇయర్ మొత్తం మీద 278 టెక్ కంపెనీలలో 1,22,606 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే 2026లో ఇప్పటివరకు కేవలం 289 టెక్ సంస్థల్లోనే ఏకంగా 1,23,305 మంది టెక్ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. గతేడాది మొత్తం సంఖ్య కంటే ఈ ఎనిమిది నెలల్లోనే 699 ఉద్యోగ కోతలు అధికంగా జరగడం పరిశ్రమలో మారిన సవాలు వాతావరణానికి అద్దం పడుతోంది.

ఈ విడత కోతలలో సిలికాన్ వ్యాలీ గ్లోబల్ టెక్ దిగ్గజాల వాటానే అగ్రస్థానంలో ఉంది. బిలియన్ల డాలర్లను ఏఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడిగా పెడుతున్న ఒరాకిల్ (Oracle) సుమారు 21,000 ఉద్యోగాల కోతతో లేఆఫ్స్ జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. ఒరాకిల్ భారతదేశంలో కూడా సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా 2,000 నుండి 3,000 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు సేకరించిన నివేదికలు సూచిస్తున్నాయి.
వీటి తర్వాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 17,267 మందిని, కంప్యూటర్ దిగ్గజం డెల్ 11,000 మందిని మరియు మెటా సంస్థ 10,400 మంది సిబ్బందిని విధులకు దూరం చేశాయి. మైక్రోసాఫ్ట్ జూలై విడతతో సహా 4,800 ఉద్యోగాలను తగ్గించగా, పేపాల్, బ్లాక్, మరియు సిస్కో కంపెనీలు ఒక్కొక్కటి దాదాపు 4,000 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ కోతలను అమలు చేశాయి.
వీటితో పాటు ఇంట్యూట్, వైజ్‌టెక్, ఏఎస్ఎమ్‌ఎల్, అట్లాసియన్, ఎరిక్సన్, లూసిడ్ మోటార్స్, ఎట్సీ (220), జిల్లో (500) మరియు భారతీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో (250) కూడా లేఆఫ్స్ అమలు చేసిన జాబితాలో ఉన్నాయి.
ఈ ఉద్యోగాల తొలగింపు సాధారణ ఆర్థిక మాంద్యం కంటే భిన్నమైనదిగా ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి కేవలం మార్కెట్ డిమాండ్ తగ్గడం వల్ల కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆటోమేషన్‌ను కంపెనీలు విస్తృతంగా ఆమోదించడం వల్ల తలెత్తుతున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ ప్రాసెసింగ్ చిప్‌లు మరియు సాంకేతిక నిపుణులపై విపరీతంగా ఖర్చు చేయడానికి పాత తరహా నిర్వహణ బృందాలు, నాన్-కోర్ ఇంజనీరింగ్ విధులను కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. మెటా వంటి సంస్థలు 'ఏఐ-నేటివ్' వర్క్‌ఫోర్స్‌ను నిర్మించే క్రమంలో ఉద్యోగులను పునర్వ్యవస్థీకరించగా, మైక్రోసాఫ్ట్ తమ ఏఐ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేస్తుండటంతో ఈ ధోరణి రాబోయే కాలంలో మరిన్ని రంగాలకు వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
