టెక్ రంగాన్ని కుదిపేస్తున్న ఉద్యోగ కోతలు..ఆరు నెలల్లో లక్షమంది రోడ్డు మీదకు..కొంపలు ముంచుతున్న ఏఐ
కరోనా తర్వా పరిస్థితులు కుదుటపడినా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు మాత్రం ఆగడం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గడ్డుకాలమే నడుస్తోంది. టాప్ కంపెనీలు అన్నీ వరుసగా లేఆఫ్‌లు (layoffs) ప్రకటించడంతో టెకీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఏఐ రాకతో దిగ్గజ కంపెనీలు మళ్లీ కోతలు ప్రారంభించాయి. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో లక్ష మందికి పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్ వంటి టెక్ దిగ్గజాలు ఈ ఉద్యోగ తొలగింపులు చేపట్టాయి.
ఇక 2025 సంవత్సరం టెక్నాలజీ రంగానికి మరో కఠినమైన ఏడాదిగా మారబోతోంది. టాప్ కంపెనీలు తమ వ్యయాలను తగ్గించేందుకు, ఆర్థిక పరిస్థితిని ఎదుర్కునేందుకు, AIతో పోటీ పడేందుకు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఈ సంవత్సరం భారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. తాజాగా మరో రౌండ్ లో మొత్తం 9,100 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

కంపెనీ ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు లేఆఫ్స్ ప్రకటించింది. మొత్తంగా ఈ ఏడాదిలో 15,000కి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ఆరంభంలో 1 శాతం మందిని తొలగించిన దిగ్గజం మే నెలలో 6 వేల మందిని రోడ్డు మీదకు పంపింది. ఇక జూన్‌లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఎక్స్‌బాక్స్, గేమింగ్ డివిజన్లలోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇక గతేడాది కూడా ఈ కంపెనీ దాదాపు 10 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చంది. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ఇంటెల్ లేఆప్స్: ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కూడా 20 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఆటోమోటివ్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. చిన్న, సమర్థవంతమైన బృందాలపై దృష్టి పెట్టాలని కొత్త CEO లిప్-బూ టాన్ స్పష్టం చేశారు.ఇప్పటికే జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను మూసేసింది. అందులో ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లోనూ దాదాపు 100 మందిని తొలగించింది. వచ్చే నెలలో మరో లేఆఫ్ రౌండ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో 20శాతం మందిని ఇంటికి సాగనంపేందుకు రెడీ అవుతోంది. చిప్ డిజైన్ సీనియర్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్చర్లు, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఈ లేఆప్స్ ఉండనున్నాయి.
అమెజాన్ తొలగింపులు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా కోతలు మొదలు పెట్టింది. తన పాత పుస్తకాల వ్యాపార విభాగంలో ఉద్యోగాలను తొలగించడమే కాకుండా, ఇతర విభాగాల్లోనూ నాలుగు విడతలలో ఉద్యోగాలపై కోతలు వేసింది. మేనేజ్మెంట్ స్థాయిలో 14,000 ఉద్యోగాలు తగ్గించే యోచనలో ఉంది.ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగుసార్లు తొలగింపులు చేపట్టింది.
ఐబీఎం లేఆప్స్: ఐబీఎమ్ దాదాపు 8,000 ఉద్యోగాలను తొలగించింది, ప్రధానంగా HR విభాగంలో ఈ కోతలు ఎక్కువగా ఉన్నాయి. AI ఆధారిత ఆటోమేషన్ వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. HR రోల్స్‌లోని దాదాపు 200మంది ఉద్యోగులను ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది ఐబీఎం. గూగుల్ కూడా తన ప్లాట్‌ఫార్మ్స్, డివైసెస్, క్లౌడ్ విభాగాల్లో వందలాది ఉద్యోగాలను తగ్గించింది. మెటా సైతం 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.
ఇక మరో దిగ్గజం.. ఇన్ఫోసిస్ కూడా ఇటీవల 240 మంది ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తొలగించింది.. గత ఫిబ్రవరిలోనూ 300 మంది ప్రెషర్స్‌కు లేఆఫ్‌లు ఇచ్చింది.గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, క్లౌడ్, హెచ్‌ఆర్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. వర్డ్‌ప్రెస్ సంస్థ ఆటొమాటిక్ 16 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. TikTok డబ్లిన్ కార్యాలయంలో 300 మందిని ఇంటికి పంపించింది. Ola Electric ఐదు నెలల్లో రెండుసార్లు కోతల్లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. HP పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 2000 మందిని తొలగించింది.
Salesforce, Blue Origin, Canva, Electronic Arts, Siemens, Match Group, CrowdStrike వంటి కంపెనీలు కూడా వందలాది ఉద్యోగాల కోతలు అమలు చేశాయి.మెటా ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 3600 మంది ఉద్యోగాలకు కోత పెట్టింది. సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్, ఈవీ ఛార్జింగ్ యూనిట్లలో దాదాపు 5,600 మందిని ఇంటికి పంపించింది.


Click it and Unblock the Notifications