ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల మధ్య కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ దశలవారీగా ఉద్యోగులను తీసేస్తూ వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. అయితే మళ్లీ లేఆప్స్ ప్రకటించింది.
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) వాషింగ్టన్ కార్యాలయం నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తీసేసిన ఉద్యోగులు సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని ది సియాటిల్ టైమ్స్ నివేదిక తెలిపింది.ఈ సారి లేఆఫ్స్ ప్రకటనలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు ప్రభావితం అయ్యారని వార్తలు వస్తున్నాయి.

కంపెనీ ఓ ప్రకటనలో.. మార్కెట్లో పోటీ తత్వం నెలకొన్న నేపథ్యంలో ఇతర కంపెనీలపై పై చేయి సాధించేందుకు తద్వారా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన మార్పులను అమలు చేస్తున్నట్లుగా తెలిపింది.ఇక మైక్రోసాఫ్ట్ గతేడాది వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. మూడు శాతం అంటే 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. ఇక 2023లో కూడా భారీగానే లేఆప్స్ ప్రకటించింది. ఆ ఏడాది ఏకంగా 10 వేల మందికి పైగానే ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్ లేఆప్స్ లో ఇదే అది పెద్ద తొలగింపులు కాగా ఆ తర్వాత ఏడాది రెండో అది పెద్ద తొలగింపులుగ చెప్పుకోవచ్చు.
ఖర్చు తగ్గించుకునే చర్యలో భాగంగానే టెక్ దిగ్గజం ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోవడానికి స్విట్జర్లాండ్‌లో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు మరో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.ఈ పెట్టుబడుల ప్రధాన లక్ష్యంలో వచ్చే రెండేళ్లలో కొత్త డేటా సెంటర్ల అభివృద్ధి కూడా ఉంది.
గత సంవత్సరం నాటికి, మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 228,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు తొలగించిన ఉద్యోగుల సంఖ్య కంపెనీలో కొద్ది శాతం మాత్రమేనని కంపెనీ ప్రకటించినప్పటికీ పదే పదే కోతలు ఉద్యోగాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి, ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. ఇక అపరిమిత వేగంతో దూసుకొస్తున్న ఏఐ కూడా ఉద్యోగాలకు ఎసరు పెడుతుండటం కూడా భయాన్ని మరింతగా రేకెత్తిస్తోంది.
గతేడాది గూగుల్, మెటా, అమెజాన్‌తో సహా సిలికాన్ వ్యాలీ అంతటా అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఇంకా సాగనంపుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications