IT News: టెక్ కంపెనీలకు ఇప్పుడు ఎక్కువగా తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయి. తగ్గుతున్న ఆదాయాలు, మార్జిన్లను కవర్ చేసుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై వారు దృష్టి సారిస్తున్నారు.
ఈ క్రమంలోనే టాప్ టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోలు గత రెండేళ్లుగా ఐరోపాలో ప్రత్యేకించి నార్డిక్ ప్రాంతంలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. భారత ఐటీ సేవల కంపెనీలకు అమెరికా తర్వాత యూరప్ వ్యాపారపరంగా అత్యంత ముఖ్యమైన మార్కెట్ గా ఉంది. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపార విస్తరణ ద్వారా యూరోపియన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే టెక్ దిగ్గజాలు అక్కడి కంపెనీల కొనుగోళ్లు, కొత్త కేంద్రాలను తెరుస్తున్నాయి. ఈ మార్కెట్ నుంచి ఆదాయాన్ని పొందే విషయంలో ఇన్ఫోసిస్, విప్రోలు.. పోటీ సంస్థలైన టీసీఎస్, HCLTech కంటే వెనుకబడి ఉండేవి . కానీ గత నాలుగు సంవత్సరాల్లో ఇవి తమ యూరోపియన్ ఆదాయ వాటాను 27-29% వరకు పెంచుకున్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో యూరోపియన్ రాబడి ఇన్ఫోసిస్ 24%, విప్రో 25.5%గా ఉన్నాయి.
2024 నాటికి నార్వేలో ఉద్యోగుల సంఖ్యను 85 నుంచి 350కి పెంచాలని విప్రో లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో కంపెనీ కొనుగోలు చేసిన క్యాప్కో ద్వారా యూరప్ నుంచి విప్రో ఆదాయ సహకారాన్ని కూడా పెంచిందని HFS చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ ఎలెనా క్రిస్టోఫర్ చెప్పారు. ఇదే క్రమంలో ఐరోపాలోని లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ప్రముఖ టెక్నాలజీ, కన్సల్టింగ్ సంస్థ అయిన BASE లైఫ్ సైన్స్ కొనుగోలును ఇన్ఫోసిస్ గత సంవత్సరం పూర్తి చేసింది.
అందుకే కంపెనీలు అక్కడ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం యూరోపియన్ జోన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు తెలుస్తోంది. ఇది కంపెనీలను ఎంతమేర ప్రభావితం చేస్తాయనే అంశం రానున్న మరికొన్ని నెలల్లో తెలియవచ్చు. దీనిని అధిగమించేందుకు టెక్ దిగ్గజాలు ఏ ప్రణాళికలతో ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications