IT News: అప్రమత్తమైన టీసీఎస్.. ఆందోళనలో Wipro, Infosys, HCL Tech..
TCS News: భారత ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ విభిన్నమైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన టెక్కీల విషయంలో కంపెనీ ప్రస్తుతం అప్రమత్తమైంది.
ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంగారు మెుత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న ఉద్యోగుల గురించే. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటించింది. ఏప్రిల్ 2023 నాటికి ఇజ్రాయెల్‌లో దాదాపు 1,100 మంది టెక్ ఉద్యోగులను కంపెనీ కలిగి ఉంది.

ఈ క్రమంలో టీసీఎస్ తన ఉద్యోగుల భద్రతపై చర్యలు చేపట్టింది. ఉద్యోగుల రక్షణను నిర్ధారించడానికి ఇజ్రాయెల్‌లోని HR అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. దీనికి తోడు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి దేశీయ సంస్థలు తమ ఇజ్రాయెల్ ఉద్యోగుల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. అలాగే ప్రస్తుతం అక్కడి పరిస్థితుల కారణంగా ఏర్పడబోయే వ్యాపార నష్టాలను, ప్రభావాన్ని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
ఎయిర్ ఇండియా వంటి ప్రధాన భారతీయ విమానయాన సంస్థలు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ సహాయంతో సంఘర్షణ ప్రాంతాల నుంచి తమ సిబ్బందిని ఖాళీ చేయగలిగాయి. ఇదే క్రమంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు భారతీయ అధికారుల నుంచి తదుపరి సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటానికి ఎంత కాలం పడుతుందోనని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications