Wipro: కొత్త వ్యాపారంతో మార్కెట్లోకి ఐటీ కంపెనీ విప్రో.. సౌత్ ఇండియా మార్కెట్ టార్గెట్..!!
Wipro: సబ్బుల నుంచి సాఫ్ట్ వేర్ వరకు అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న సంస్థ విప్రో. దేశంలో ఇప్పటికే మనందరికీ చాలా బాగా తెలిసిన సంతూర్ సోప్ బ్రాండ్ విప్రో కంపెనీదేనని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కంపెనీ ఎఫ్ఎమ్సీజీ రంగంతో పాటు లైటింగ్ వ్యాపారంలోనూ ముందంజలోనే ఉంది. 1945లో వనస్పతి ఉత్పత్తితో విప్రో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించింది.
అయితే తాజాగా కంపెనీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. కంపెనీ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం త్వరలోనే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్నాక్స్ తయారీ రంగంలో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా సంస్థ కేరళకు చెందిన బ్రాహ్మిన్స్‌ను కొనుగోలు చేస్తోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే సాంప్రదాయ శాఖాహారం, మసాలా మిక్స్, రెడీ-టు-కుక్ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది.

ఇప్పటికే దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో బికాజీ, హల్దీరామ్స్, బాలాజీ వంటి అనేక సంస్థలు స్నాక్స్ మార్కెట్లో మంచి మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిద భారతదేశంలో చాలా తక్కువ సంస్థలు ఈ రంగంలో ఉండటం తమకు కలిసిరానుందని కంపెనీ భావిస్తోంది. దీనికోసం స్నాక్స్ విభాగంలో తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉందని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ వెల్లడించారు.
రానున్న కాలంలో స్పైసెస్ వ్యాపారంలో మరింతగా విస్తరించటానికి విప్రో మరిన్ని కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికతో ముందుకు సాగనుందని వినీత్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గత ఏడాది డిసెంబరులో నిరపారా బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. దక్షిణ భారతంలో ఆహారపు అలవాట్లకు అనుగుణంగా కంపెనీల కొనుగోలును సాగించాలని తద్వారా కస్టమర్ల ఆదరణను సులువుగా చూరగొనవచ్చని సంస్థ భావిస్తోంది.
కొత్తగా లాంచ్ చేయనున్న స్నాక్స్ బ్రాండ్ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అగర్వాల్ తెలిపారు. లాంచ్ సమయంలో ముందుగా 4 నుంచి 5 ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న విప్రో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. ఎందుకంటే ఇవి నేరుగా కిరాణా స్టోర్లకు సబ్బుల సరఫరా వ్యవస్థ కలిగి ఉంది కాబట్టి.


Click it and Unblock the Notifications