Wipro: ఫ్రెషర్లకు విప్రో కొత్త షాక్.. గతంలో జాబ్ తొలగింపు ఇప్పుడేమో..? పాపం..
Wipro: ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనే విషయం అనేక మార్లు వెల్లడైంది. ఎన్నో ఆశలతో చదువు పూర్తి చేసుకుని కార్పొరేట్ కంపెనీల్లో కొలువు సంపాదించినప్పటికీ యువ టెక్కీలు మంచి జీతాలను పొందలేకపోతున్నారని ఆందోళనలు ఉన్నాయి. ఈ తరుణంలో విప్రోలో జరిగిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

విప్రో ఆఫర్..
ఇటీవల ఆన్ బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లను విప్రో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు కానివారిని తొలగించింది. దీనిని మనం మరచిపోక ముందే మరో విషయం బయటకు వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం ఫ్రెషర్లకు గతంలో ఆఫర్ చేసిన శాలరీ ప్యాకేజీలను తగ్గించింది. అయితే ఈ తగ్గించిన ప్యాకేజీలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆన్ బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లను కంపెనీ అడిగినట్లు ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.

ప్యాకేజీ వివరాలు..
ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో అలుముకున్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీల వ్యాపార మార్జిన్లు కొంత ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దీని వల్ల విప్రో 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ఆన్ బోర్డింగ్ ప్రక్రియను చాలా నెలలుగా ఆలస్యం చేస్తోంది. కంపెనీ ఎలైట్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు రూ.3.50 లక్షల ప్యాకేజీ, టర్బో అభ్యర్థులకు రూ.6.50 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఎలైట్ అభ్యర్థులు టర్బోకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా కంపెనీ వెలాసిటీ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొందాలి.

విప్రో పంపిన మెయిల్..
ప్రస్తుతం కంపెనీలో రిక్రూట్‌మెంట్ కోసం రూ.3.50 లక్షల వార్షిక ప్యాకేజీకి ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీలు ఉన్నాయని మెయిల్ లో వెల్లడించింది. విద్యార్థి ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే వారు మార్చి నుంచి వారు ఆన్‌బోర్డ్ చేయబడతారని తెలిపింది. ఈ ఆఫర్ అంగీకరించాక గతంలో కంపెనీ వారికి అందించిన ఆఫర్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. సమయానుకూలంగా విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందాలని ప్రోత్సహిస్తున్నట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది.

విద్యార్థుల రియాక్షన్..
ఆన్ బోర్డింగ్ కోసం చాలా నెలలుగా వేచి ఉన్న విద్యార్థులు కంపెనీ మెయిల్ పై స్పందించారు. తాము రూ.6.50 లక్షల ప్యాకేజీకి ఆఫర్ పొందామని.. అయితే ఇప్పుడు కంపెనీ ఇలాంటి మెయిల్ పంపటం అన్యాయమని అంటున్నారు. కంపెనీ నుంచి మంచి ప్యాకేజీ వచ్చినందునే ఉన్నాళ్లుగా తాము వేచి ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఒక విద్యార్థి స్పందిస్తూ విప్రో తమను ట్రాప్ చేసిందని అన్నారు. విప్రో తాజా ప్రకటనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్లో పోటీ..
ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. దీనికి తోడు 2023 గ్రాడ్యుయేట్ల కూడా ఆన్‌బోర్డ్‌లో ఉండవలసి ఉంటుంది. అందువల్ల మారుతున్న స్థూల వాతావరణం, వ్యాపార అవసరాల దృష్ట్యా కంపెనీ తన ఆన్‌బోర్డింగ్ ప్లాన్‌లను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని కంపెనీ ఈ వ్యవహారంపై ప్రతిస్పందించింది. కంపెనీ విద్యార్థులు కెరీర్ ను ప్రారంభించేందుకు, కొత్త నైపుణ్యాలను సంపాదించేందుకు తక్షణ అవకాశాన్ని సృష్టిస్తుందని తెలిపింది.


Click it and Unblock the Notifications