Wipro News: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో ఇటీవల తీసుకున్న అనేక చర్యలు సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్ల నియామకం, ఆన్ బోర్డింగ్, వారి వేతనాలను సగానికి కుదించటం వంటి పరిణామాలు చాలా మందికి ఆందోళన కలిగించాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్, ఐటీ సేవల రంగంలోని చాలా కంపెనీలు ఆర్థికంగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. అయితే భారత కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి తొలగింపులను ప్రకటించలేదు. ఈ క్రమంలో ఫ్రెషర్లు మాత్రం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం విప్రో కంపెనీలో ఆన్ బోర్డ్ అయ్యేందుకు చాలా మంది ఫ్రెషర్లు దాదాపుగా 15 నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఫ్రెషర్లకు కంపెనీ మరో కొత్త ట్రైనింగ్ ఇస్తోంది. ఈ ట్రైనింగ్ తర్వాత వారికి పరీక్ష పెడుతుంది. ఉత్తీర్ణత సాధించని వారిని కంపెనీ తిరస్కరించటం ద్వారా ఈ ప్రక్రియ ముగుస్తుంది. దీనికి ముందు ఫిబ్రవరిలో కంపెనీ ముందుగా ఆఫర్ లెటర్ లో రూ.6.50 లక్షల ప్యాకేజీ అందించిన వారిని రూ.3.50 లక్షల ప్యాకేజీకి ఒప్పుకుంటే నియమించుకుంటామంటూ ప్లేటు పిరాయించింది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఫ్రెషర్లు ఇప్పటికే తమ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కంపెనీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఎదురైన ఇబ్బందిని ఒక ఫ్రెషర్ వెల్లడించాడు. 2021 నవంబరులో తాను ఎంపికయ్యానని ఆ తర్వాత కంపెనీ వెలాసిటీ ట్రైనింగ్ ఇచ్చి తనకు రూ.6.50 లక్షల ప్యాకేజి ఆఫర్ చేసిందన్నాడు. ఆ తర్వాత ఏడాది వేచి చూశాక రూ.3.50 లక్షలకు ఒప్పుకుంటే ఆన్ బోర్డ్ చేస్తామందని వెల్లడించాడు. తీరా దానికి ఒప్పుకున్నాక మళ్లీ ఇప్పుడు PRP ట్రైనింగ్ ఇస్తోందని చివరికి పరీక్ష పెట్టి వీలైనంత మందిని తొలగించాలని చూస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థతో దయనీయ పరిస్థితిని వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం కంపెనీ ప్రవర్తిస్తున్న తీరు అన్యాయమైనదని, అనైతికమైనదని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా అన్నారు. కంపెనీ పాలసీలో అకస్మాత్తు మార్పుల కారణంగా ఫ్రెషర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడేశిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు లేక అనేక మంది ఉద్యోగులను బెంచ్ మీద ఉంచినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications