Apple Stores: భారత ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తన సొంత రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
అయితే దేశంలో తన రిటైల్ పాదముద్రను మరింతగా విస్తరించాలని ఆపిల్ సంస్థ చూస్తోంది. ఇటీవల దిల్లీ, ముంబైలలో స్టోర్లను ఓపెన్ చేసిన కంపెనీ 2027 నాటికి మరో మూడు ఆఫ్‌లైన్ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆపిల్ తన మూడవ స్టోర్‌ను 2025లో ముంబై శివారులోని బోరివలిలో ప్రారంభించాలని యోచిస్తోంది.

అలాగే నాలుగో ఆపిల్ స్టోర్‌ను 2026లో న్యూదిల్లీలోని DLF ప్రొమెనేడ్ మాల్‌లో ప్రారంభించాలను ప్లాన్ చేస్తోంది. ఇక 2027లో ఐదువ స్టోర్‌ను ముంబై సముద్రతీరంలోని వర్లీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఏప్రిల్ 2023లో Apple తన మొదటి రెండు ప్రత్యేకమైన ఇండియా రిటైల్ స్టోర్‌లను CEO టిమ్ కుక్ స్వయంగా ముంబై, ఢిల్లీలో ప్రారంభించారు.
కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌ల విస్తరణ ద్వారా భారతదేశంతో ఆసియాలోకి మరింత లోతుగా వెళ్లాలనే ఆపిల్ లక్ష్యంలో భాగంగా ఉంది. iPhone తయారీదారు రాబోయే నాలుగేళ్లలో 24 కొత్త స్టోర్‌లను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోందని.. వీటిలో 15 ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే ఏర్పాటు కానున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ఈ స్టోర్లు ఇండియా, మలేషియా, జపాన్, చైనా, దక్షిణ కొరియాల్లో ఏర్పాటు కానున్నాయి.
యాపిల్‌కు వేగంగా అభివృద్ధి చెందతూ అత్యధికంగా జనాభా కలిగిన ఆసియా మార్కెట్ కీలక వృద్ధి ఇంజిన్. గత ఏడాది ఆపిల్ తన ఆదాయంలో దాదాపు మూడింట ఒక వంతు అంటే సుమారు 130 బిలియన్ డాలర్లను వీటి నుంచే ఆర్జించింది. అలాగే ఇండియాలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు స్టోర్ల నుంచి అమ్మకాల ద్వారా గత నెలలో దాదాపు రూ.50 కోట్ల ఆదాయాన్ని ఆపిల్ ఆర్జించిందని తాజా సమాచారం.


Click it and Unblock the Notifications