Wipro: కరోనా కేసులతో విప్రో అప్రమత్తం.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం..
Wipro News: ఏడాది చివరికి వచ్చిన వేళ మళ్లీ ప్రపంచంపై తన పంజా విసిరింది. కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వేళ కేసుల పెరుగుదలతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ కరోనా విజృంభణతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అలాగే వ్యాపార సంస్థలు సైతం తమ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తన ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా చూసేందుకు చర్యలు చేపడుతోంది.

తాజాగా విప్రో తన ఉద్యోగులకు ఫ్లేక్సిబుల్ వర్క్ ప్లేస్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా టెక్కీల భద్రత, ప్రతిభావంతుల వృత్తిపరమైన వృద్ధికి భరోసా ఇస్తూనే తన ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సౌకర్యవంతమైన కార్యాలయ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. దీనికి ముందు నవంబర్ నుంచి పూర్తిగా వ్యాక్సినేషన్ చేసుకున్న ఉద్యోగులను వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందిగా కంపెనీ ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ స్థానిక ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియం జేఎన్1 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 23న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో 752 కరోనా వైరస్ కేసులు ఒకే రోజు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులను పరిశీలిస్తే డిసెంబర్ 26న రెండు కరోనా మరణాలు హైదరాబాదులో నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే మార్గదర్శకాలను ఇతర టెక్ దిగ్గజాలు వెల్లడించలేదు. దీంతో ఉద్యోగులు సైతం ఆఫీసులకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications