TCSకు జాక్ పాట్.. ఏపీలో 99పైసలకే 21.6 ఎకరాల భూమి.. కేటాయించిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21.6 ఎకరాల భూమిని 99 పైసలకు టెక్ దిగ్గజం TCSకి కేటాయించింది. ఏప్రిల్ 15న అంటే ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకి ఆమోదించే లభించింది. గుజరాత్ రాష్ట్రం తాజాగా టాటా మోటార్స్'కు 99 పైసలకు భూమిని కేటాయించాక ఈ వార్త వెలువడింది. విశాఖపట్నంలోని ఐటీహిల్-3 ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు 21.66 ఎకరాల భూమిని, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాల భూమిని కేటాయించడంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఎపి ప్రభుత్వం ఈ భూమిని కేవలం 99 పైసలకి కేటాయించింది. అయితే విశాఖపట్నంని ఒక టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఈ కేటాయింపు చోటు చేసుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలతో పాటు టిసిఎస్ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత ఏడాది అక్టోబర్ 2024లో నారా లోకేష్ ముంబైలోని టాటా గ్రూప్ హెడ్ ఆఫీస్ సందర్శించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద ఎత్తున డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమని TCSను ఆహ్వానించారు. దీని తరువాత రాష్ట్ర ప్రభుత్వం అలాగే TCS మధ్య చర్చలు జరిగాయి, చివరికి ఈ చర్చలు ఫలించి నేడు ఈ భూ కేటాయింపు జరిగింది.
ఈ కేటాయింపులకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఐటి పరిశ్రమకు తదుపరి పెద్ద కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని దేశానికి అలాగే ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. TCSకి ఇటువంటి ఆఫర్ ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులకు ఇక్కడ వనరులు మాత్రమే కాకుండా ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుందని మేము హామీ ఇస్తున్నాము అని అన్నారు.
ఈ నిర్ణయం గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సనంద్‌లో టాటా మోటార్స్‌కు కేవలం 99 పైసలకు భూమిని కేటాయించిన విషయాన్నీ గుర్తు చేస్తుంది, టాటా మోటార్స్‌కు ఈ కేటాయింపుతో గుజరాత్ దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ హబ్‌గా అవతరించింది. 100 ఎకరాల భూమితో పాటు గుజరాత్ ప్రభుత్వం ధోలేరాలో విస్తరణ కోసం టాటా ఎలక్ట్రానిక్స్‌కు అవసరాన్ని బట్టి 63 ఎకరాల భూమిని ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. మరోవైపు వైజాగ్‌లో కార్యకలాపాలకి సంబంధించిన ప్రణాళికలను TCS ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications