EV Vehicles: ఛార్జింగ్ స్టేషన్లు, త్వరలో 12వేల వరకు ఉద్యోగాలు
ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల(EVs) సేల్స్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. విద్యుత్ వాహనాలు క్రమంగా పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముడి చమురు దిగుమతిపై గత ఏడాది కాలంలో ప్రభుత్వం రెండుమార్లు భారీగా దిగుమతి సుంకాలను పెంచింది. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దీనికి మరో కారణం కూడా ఉంది. పారిస్ ఒప్పందం ప్రకారం కర్బన ఉద్గారాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

టీంలీజ్ అంచనా
అంతర్జాతీయంగా, తదనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పుంజుకుంటోంది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో దేశంలో యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మూడో త్రైమాసికం తర్వాత విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల్లో పదివేల నుండి 12వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని టీంలీజ్ సర్వీసెస్ అనే కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది.

త్వరలో ఉద్యోగాలు
వచ్చే మూడు నుండి నాలుగు నెలల కాలంలో వివిధ విద్యుత్ వాహన సంస్థలు చార్జింగ్ స్టేషన్లలో తమకు అవసరమైన సిబ్బందిని నియమించడం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని టీమ్ లిజ్ పేర్కొంది. తొలి దశలో నాలుగు మెట్రో నగరాలు, నాలుగు కాస్మోపాలిటన్ నగరాల్లో 60 వరకు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

సేల్స్ ఇలా
సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రకారం FY20లో భారత్‌లో మొత్తం 1,55,400 యూనిట్ల ఈవీ వెహికిల్స్ సేల్ అయ్యాయి. FY19లో 1,29,600 సేల్ అయ్యాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షల కారణంగా FY21లో 140,000 యూనిట్లకు పరిమితమయ్యాయని అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications