టీసీఎస్ కంపెనీకి బిగ్ షాక్.. అమెరికన్ ఉద్యోగులను తొలగించడంపై విచారణ షురూ..
అమెరికా సెనేట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నియామక విధానాలపై కీలక చర్చ మొదలైంది. ముఖ్యంగా H-1B వీసాల వినియోగం, అమెరికన్ ఉద్యోగుల తొలగింపులు, విదేశీ సిబ్బందికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై సెనేటర్లు చక్ గ్రాస్లీ,డిక్ డర్బిన్ టీసీఎస్ మేనేజ్‌మెంట్‌కు తొమ్మిది కీలక ప్రశ్నలను లేఖలో పంపారు. ఈ లేఖ ప్రకారం టీసీఎస్ అమెరికాలోని జాక్సన్‌విల్లే కార్యాలయంలో 60 మందికి పైగా ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అదే సమయంలో వేలాదిమంది విదేశీ టెక్ కార్మికుల కోసం H-1B పిటిషన్లు దాఖలు చేయడం అమెరికా ప్రతినిధులకు అనుమానాలు రేకెత్తించింది.
లేఖలో 2025 ఆర్థిక సంవత్సరానికి చెందిన డేటాను ఉదహరించారు. ఆ కాలంలో టీసీఎస్ 5,505 H-1B ఉద్యోగులకు ఆమోదం పొందింది, దీని వలన USలో రెండవ అతిపెద్ద H-1B యజమానిగా నిలిచింది. అమెరికాలో స్థానిక ప్రతిభ కొరత లేదనే వాస్తవం మధ్య, టీసీఎస్ అర్హత కలిగిన అమెరికన్ టెక్ కార్మికులను కనుగొనలేదని నమ్మడం కష్టం. స్థానిక ఉద్యోగులను తొలగించి, విదేశీ కార్మికులను ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయం అనిసెనేటర్లు లేఖలో స్పష్టంగా తెలిపారు.

ఇప్పటికే టీసీఎస్‌పై సమాన ఉపాధి అవకాశాల కమిషన్ (EEOC) దర్యాప్తు కొనసాగుతోందని లేఖ గుర్తు చేసింది. దక్షిణాసియా మూలాల H-1B కార్మికులకు ప్రాధాన్యం ఇచ్చి, అమెరికన్ కార్మికులను పక్కన పెట్టారనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని పేర్కొంది. ఈ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కూడా కొత్త H-1B నియామకాలు చేయడం కంపెనీకి ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
సెనేటర్లు తమ లేఖలో పలు కీలక ప్రశ్నలు ఇవే..
టీసీఎస్ ఎప్పుడైనా అమెరికన్ ఉద్యోగులను H-1B కార్మికులతో భర్తీ చేసిందా?
H-1B నియామక ప్రకటనలను సాధారణ జాబ్ పోస్టింగ్‌ల నుండి వేరుగా ఉంచి దాచిపెడుతుందా?
H-1B ఉద్యోగులకు స్థానిక అమెరికన్ ఉద్యోగుల మాదిరిగానే జీతం, ప్రయోజనాలు అందుతున్నాయా?
TCS ప్రత్యక్షంగా ఎంతమంది H-1B ఉద్యోగులను నియమిస్తుంది, ఎంతమందిని కాంట్రాక్టర్ల ద్వారా అవుట్‌సోర్స్ చేస్తుంది?
2025లో ఆమోదం పొందిన H-1B పిటిషన్లలో ఎంతమంది ఇతర కంపెనీలకు బదిలీ చేయబడ్డారు?
ఈ ప్రశ్నలకు అక్టోబర్ 10, 2025లోపు పూర్తి సమాధానాలను ఇవ్వాలని టీసీఎస్‌ను కోరారు.
ఇక H-1B వీసా ఫీజులపై కొత్త పరిణామం కూడా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేసిన ఉత్తర్వు ప్రకారం, కొత్తగా దాఖలయ్యే H-1B వీసాల రుసుము USD 100,000 వరకు పెరుగనుంది. ప్రస్తుతం ఈ రుసుము USD 2,000 నుండి 5,000 వరకు ఉండగా ఈ పెంపు IT కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నోట్‌లో తెలిపినట్లు.. కొత్త ఫీజులు IT కంపెనీలను స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించడానికో లేదా ఆఫ్‌షోర్ డెలివరీ సెంటర్లను విస్తరించడానికో ప్రేరేపించవచ్చు. అయితే, ఈ కొత్త ఫీజులు FY27 నుండి మాత్రమే అమల్లోకి వస్తాయని తెలిపారు.


Click it and Unblock the Notifications