Dinanath Kholkar: ఇండియన్ ఐటీ కంపెనీలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి ఊహించని ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న వారి బలాలు బలహీనతలుగా మారిపోతున్నాయి. దీంతో మార్కెట్ ఆధిపత్యాన్ని చెలాయించటంలో వెనకపడుతున్నాయి.
భారతీయ టెక్ కంపెనీల్లో ప్రముఖులు, ఉన్నత స్థాయి ఉద్యోగులను ప్రత్యర్థి సంస్థలు వేటాడుతున్నాయి. వారికి మంచి పొజిషన్, శాలరీ వంటివి ఆఫర్ చేస్తూ తమ సంస్థల్లోకి తీసుకెళుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీల్లో చోటుచేసుకోగా తాజాగా ఇది టెక్ దిగ్గజం టీసీఎస్‌కు కూడా పాకినట్లు కనిపిస్తోంది. దీంతో వరుస రాజీనామాల పర్వం భారత ఐటీ సేవల కంపెనీలను కలవరానికి గురిచేస్తోంది.

తాజాగా టీసీఎస్ సీనియర్ అధికారి దీనానాథ్ ఖోల్కర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన తన పార్టనర్ ఎకోసిస్టమ్స్ & అలయన్స్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ పాత్ర నుంచి తప్పుకున్నారు. దీనానాథ్ కంపెనీలో 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని నేటితో ముగించారు. వాస్తవానికి ఆయన 1996లో TCSలో డేటా వేర్‌హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. అయితే రాజీనామా తర్వాత ఇతర ప్రత్యర్థి కంపెనీల్లో చేరతారేమో వేచి చూడాల్సిందే.
కంపెనీలో ఆయన ప్రయాణాన్ని పరిశీలిస్తే.. దీనానాథ్ టీసీఎస్ eServe సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత BFSI BPO ఛైర్మన్‌గా సేవలు అందించారు. ఆ తర్వాతి కాలంలో 2017-22 మధ్య గ్లోబల్ హెడ్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్‌గా కూడా పదోన్నతిని పొందారు. కంపెనీని వీడుతున్న ఆయన తన 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది నిపుణులతో కలిసి పనిచేసే అదృష్టం కలిగిందని అన్నారు. ఈ క్రమంలో పనిలో నాకు చాలా గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. దీనానాథ్ గోల్కర్ రాజీనామాతో కంపెనీ ఆయన స్థానంలో పార్టనర్ ఎకోసిస్టమ్స్ & అలయన్స్‌ల గ్లోబల్ హెడ్‌గా రాజీవ్ రాయ్‌ని నియమించింది.


Click it and Unblock the Notifications