IT News: సస్పెండ్ అయిన ఉద్యోగి TCSకు రిటర్న్ గిఫ్ట్.. కంపెనీ ప్రతిష్ఠ గోవిందా..
TCS News: దేశం గర్వించదగ్గ కంపెనీల్లో టాటా గ్రూపు ఒకటి. నిబద్ధతకు, నిజాయితీకి, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వృద్ధి పథంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను సైతం ఛాలెంజ్ చేసి సత్తా చాటుతోంది. అయితే అడపాదడపా చోటు చేసుకుంటున్న సంఘటనలు సంస్థ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తున్నాయి.
కంపెనీలో భద్రతాపరమైన సంఘటనను నివేదించిన ఉద్యోగిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సిబ్బందిని వారి వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించమని మేనేజర్ బలవంతం పెట్టినట్లు ఫిర్యాదు చేశానని ఆ ఉద్యోగి తెలిపారు. లాగిన్ క్రెడెన్షియల్స్ పంచుకోవాలని కోరినట్లు కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. జరిగిన ఈ వ్యవహారాన్ని సదరు ఉద్యోగి రెడ్డిట్‌లో పంచుకున్నారు.

TCS తీసుకున్న నిర్ణయం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగి తెలిపారు. విజిల్‌బ్లోయర్‌పై ఎటువంటి చర్య తీసుకోలేరని పేర్కొన్నారు. మేనేజర్ లేదా హ్యూమన్ రిసోర్స్‌తో తనకు మంచి సంబంధాలు లేనందున వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదని వెల్లడించారు. సదరు ఉద్యోగి పోస్టుపై పలువురు రెడ్డిట్ యూజర్లు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయమని ఓ వినియోగదారులు ఆ ఉద్యోగికి సలహా ఇచ్చారు. TCS మాత్రమే కాకుండా టాటా గ్రూప్‌లోని ఉన్నతాధికారులను ట్యాగ్ చేయమని సూచించారు. టాటా గ్రూపు ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమని చెబుతున్నారు. కేవలం లింక్డ్‌ఇన్ మాత్రమే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ చేయాలని పిలుపునిస్తున్నారు. TCS ఎథిక్స్ కమిటీ దృష్టికి విషయం తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.


Click it and Unblock the Notifications