దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బైబ్యాక్ ఆఫర్ ప్రారంభతేదీని ప్రకటించింది. ఈ ఆఫర్ వ్యాల్యూ దాదాపు రూ.16వేలకోట్లుగా భావిస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన ప్రారంభమై, జనవరి 1వ తేదీన ముగియనుంది. గత నెలలో 5,33,33,333 వాటాలను బైబ్యాక్ చేసేందుకు టీసీఎస్ వాటాదారులు అనుమతిని ఇచ్చారు. ఒక్కో షేర్ రూ.3000 వద్ద కొనుగోలు చేయనున్నారు. టీసీఎస్ బైబ్యాక్ చేయనుందని గతంలోనే ప్రకటించారు. తాజాగా, తేదీని ప్రకటించారు.

అందుకే బైబ్యాక్
సెబి బైబ్యాక్ నిబంధనలు 2018 ప్రకారం ఆఫర్ లెటర్‌ను అర్హులైన వాటాదారులకు పంపిస్తామని, ఈ ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీ కంటే ముందు పూర్తవుతుందని బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్ తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లోనే బైబ్యాక్‌కు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించింది. ఆఫర్ 18వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు తుది గడువుగా తెలిపింది. స్టాక్ ఎక్స్చేంజీలో దీనికి సంబంధించిన బిడ్స్ పరిష్కారానికి తుది గడువు జనవరి 12గా ప్రకటించింది. వాటాదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వాలనే కంపెనీ పాలసీకి అనుగుణంగా ఈ బైబ్యాక్ చేపట్టినట్లు టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ తెలిపారు.

టీసీఎస్ వద్ద రూ.58,500 కోట్ల నిల్వలు
ప్రస్తుతం టీసీఎస్ వద్ద సెప్టెంబర్ చివరి నాటికి రూ.58,500 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గతంలో ఒకసారి బోనస్‌ను ప్రకటించింది. అక్టోబర్ నెలలో ఈక్విటీ షేర్ పైన రూ.40 స్పెషల్ డివిడెండ్ ఇచ్చింది. ఇప్పుడు బైబ్యాక్‌ను ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు మరో ఐటీ సంస్థ విప్రో కూడా బైబ్యాక్‌ను ప్రకటించింది. రూ.400 వద్ద రూ.9,500 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది.

అప్పుడే బైబ్యాక్ గురించి..
టీసీఎస్ 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించిన సమయంలో బైబ్యాక్‌ను ప్రకటించింది. ఆ సమయంలో ఇన్వెస్టర్లకు బైబ్యాక్, ఉద్యోగులకు వేతన పెంపు గుడ్ న్యూస్ చెప్పింది. టీసీఎస్ 2017 తర్వాత మూడో మెగా బైబ్యాక్‌ను ప్రకటించింది. కాగా, టీసీఎస్ షేర్ ధర నేడు 0.75 శాతం క్షీణించి రూ.2,790 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications