టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...
ఇండియాలో ఐటీ జాబ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు టీసీఎస్ (TCS). టాటా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతోంది.అలాంటి టీసీఎస్, గతేడాది తమ ఉద్యోగుల్లో 2 శాతం మందిని, అంటే సుమారు 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి యావత్ ఐటీ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తీసేస్తున్నారని, ఉన్నట్టుండి పిలిచి జాబ్ లేదని చెబుతున్నారని, చాలామందితో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని సోషల్ మీడియాలో టీసీఎస్‌పై ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక శాఖలకు కూడా వరుసగా ఫిర్యాదులు అందాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీసీఎస్‌కు మరో పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అదేంటంటే, కంపెనీలోని సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నపళంగా రాజీనామాలు చేస్తున్నారు. మొత్తం 1800 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో గత 8 నెలల్లోనే ఏకంగా 300 మంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు.

టీసీఎస్‌పై నమ్మకం తగ్గడమే ఈ ఆకస్మిక రాజీనామాలకు ఒక కారణంగా చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత పదవుల్లో ఉండి, ఏళ్ల తరబడి కంపెనీతో కలిసి పనిచేసిన వారు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
గతేడాది టీసీఎస్ ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగించడం, సీనియర్ ఉద్యోగుల్లో కూడా భయాన్ని, ఉద్యోగ అభద్రతను పెంచిందని 'మింట్' నివేదిక పేర్కొంది. ఎంత దీర్ఘకాలంగా పనిచేస్తున్నా, మంచి జీతం ఉన్నా... ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని వాతావరణంలో పనిచేయడం ఇష్టం లేక చాలామంది స్వయంగా తప్పుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఇలా కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నపళంగా వెళ్లిపోవడం కంపెనీకి, దాని క్లయింట్‌లకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఒకప్పుడు టీసీఎస్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అనే భావన ఉండేది. కానీ, ఏఐ (AI) రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క మెయిల్ వస్తే చాలు, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా కంపెనీని విడిచి వెళ్లాల్సిందే.
ఇది కేవలం టీసీఎస్‌లోనే కాదు, ఇండియాలోని చాలా అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏఐ రాకతో పనులు సులభతరం కావడంతో, కంపెనీలు కూడా 'మల్టీ-లెవల్ మేనేజ్‌మెంట్' నిర్మాణాన్ని తగ్గిస్తున్నాయట. అందుకే, సీనియర్ ఉద్యోగులు వెళ్లిపోయినా, అందుకు అనుగుణంగా కంపెనీలు తమ నిర్మాణాన్ని మార్చుకుంటున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications