పుణేలోని టీసీఎస్ కార్యాలయం ముందు ఫుట్‌పాత్‌పై ఒక ఉద్యోగి పడుకున్న ఫోటోపై టీసీఎస్ మేనేజ్‌మెంట్ స్పందించింది.
ఆ వ్యక్తి పేరు సౌరభ్ మోర్. ఆయన ఆరోపణల ప్రకారం, నాలుగు నెలలుగా జీతం రాకపోవడంతో ఆయన ఈ అడుగు వేయాల్సి వచ్చింది. తాను పనిచేసిన ఆఫీస్ గేటు బయటే, తన బ్యాగ్‌ను దిండుగా పెట్టుకుని పడుకున్నాడు. పక్కనే ఒక చేతిరాసిన లేఖలో - "హెచ్ఆర్‌కి నా పరిస్థితి వివరించాను. నిధులు లేవని చెప్పారు. ఇప్పుడు నివసించేందుకు డబ్బు లేకపోవడంతో ఇక్కడే ఉండాల్సి వచ్చింది" అంటూ వేదనతో రాశాడు.

ఈ ఫోటోలు వైరల్ కావడంతో టీసీఎస్ సంస్థ స్పందించింది:
అధికారికంగా కంపెనీ వెల్లడించిన ప్రకారం సౌరభ్ అనధికారిక సెలవు తీసుకున్నారని, అదే కారణంగా జీతం నిలిపివేశామని తెలిపారు. ఇది తమ విధానాల ప్రకారం తీసుకున్న చర్య అని పేర్కొన్నారు.
అయితే, సౌరభ్ ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై లేరని, సంస్థ తరఫున అతనికి తాత్కాలిక వసతి కల్పించామని చెప్పారు. "ఆయన తిరిగి ఉద్యోగంలో చేరాలని కోరుతున్నారు. మేమూ అతనికి సహాయం చేస్తున్నాం. ఈ వ్యవహారంలో మానవీయంగా, సానుకూలంగా వ్యవహరిస్తున్నాం" అని కంపెనీ ప్రతినిధి చెప్పాడు.
సౌరభ్ చెప్పినట్టు, జూలై 29న ఉద్యోగానికి రావడంతోనే తన ఐడి టీసీఎస్ సిస్టమ్‌లో యాక్టివ్‌గా లేదని గుర్తించారని, హెచ్ఆర్‌కి సమాచారం ఇచ్చినా సమస్య తీరలేదని తెలిపారు. జీతం త్వరలో వస్తుందన్న మాట విన్నా... నిజంగా జీవించలేని పరిస్థితి వచ్చేసరికి, చివరికి ఫుట్‌పాత్‌కే ఆశ్రయమయ్యింది.
ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత, పారదర్శకతపై పెద్ద ప్రశ్నలు తలెత్తితున్నాయి. పెద్ద కంపెనీలు సైతం ఈ తరహా సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కార్పొరేట్ ఉద్యోగులకి మంచి జీతం వస్తుందని చాలామందికి భావన ఉంటుంది. కానీ ఆ జీతం వెనుక వాళ్లపై ఉండే ఒత్తిడి, బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక నెల జీతం ఆలస్యం అయినా వారి జీవితంలో ఎంత గందరగోళం ఏర్పడుతుందో ఊహించగలం.
వాళ్లు కట్టాల్సిన అద్దె, EMIలు, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు అన్నీ ఆగిపోతాయి. అప్పులు పెరిగిపోతాయి. బయటనుండి చూస్తే ఇవన్నీ చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అసలు ఆ పరిస్థితిలో ఉన్నవారికే అసలైన బాధ తెలుస్తుంది.
అలాంటి వేళల్లో వాళ్ల మనసు కుంగిపోతుంది. "నాకు ఈ నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది?" అనే ప్రశ్న నిత్యం తలలో తిరుగుతుంది. వాళ్లు కంపెనీకి చెప్పినా పట్టించుకోకపోతే, చివరికి ఇలా ఫుట్‌పాత్‌పై పడుకోవాల్సిన పరిస్థితికి చేరుతారు. ఇది కేవలం ఒక ఉద్యోగి సమస్య కాదు... ఇది కార్పొరేట్ వ్యవస్థలో మానవీయత ఎంత ఉండాలి అనే విషయంపై పెద్ద ప్రశ్న.


Click it and Unblock the Notifications