భారతదేశపు ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) మూడవ త్రైమాసికం (Q3)లో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక వేరియబుల్ పే అవుట్‌ను గణనీయంగా పెంచింది. తాజాగా అమలులోకి వచ్చిన ఈ నిర్ణయంతో.. అర్హత కలిగిన మిడ్-లెవల్ ఉద్యోగులకు గరిష్టంగా 80 శాతం వరకు వేరియబుల్ పే చెల్లింపులు జరిగాయి. గత దాదాపు రెండేళ్లుగా 20-50 శాతం మధ్య పరిమితమైన వేరియబుల్ పే పొందుతున్న ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారింది. 2026 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మెరుగుపడుతుందనే మేనేజ్‌మెంట్ ఆశావాదం, అలాగే కంపెనీ తీసుకుంటున్న AI-ఆధారిత వ్యూహాత్మక మార్పులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మనీ కంట్రోల్ వర్గాల సమాచారం ప్రకారం.. మిడ్-లెవల్ ఉద్యోగులు ఇప్పుడు తమ ఆఫర్ లెటర్‌లో పేర్కొన్న మొత్తం వార్షిక వేతనం (CTC)కు దగ్గరగా వేరియబుల్ పే పొందుతున్నారు. సీనియర్ స్థాయి ఉద్యోగుల విషయంలో వేరియబుల్ పే ఇప్పటికీ 40 నుంచి 80 శాతం మధ్యే ఉన్నప్పటికీ, గత త్రైమాసికాలతో పోలిస్తే ఇది స్పష్టమైన మెరుగుదలగా చెప్పవచ్చు. కొంతమంది ఉద్యోగులు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే జనవరిలోనే అందిందని తెలిపారు. ప్రచురణ సమయానికి TCS ఈ అంశంపై అధికారికంగా స్పందించకపోయినా.. ప్రతిస్పందన వచ్చిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని వర్గాలు పేర్కొన్నాయి.

డిమాండ్ దృక్కోణంలో కంపెనీ ప్రదర్శిస్తున్న నమ్మకం ఈ నిర్ణయాన్ని మరింతగా బలపరుస్తోంది. TCS తన AI వ్యూహాన్ని మరింత వేగవంతం చేస్తూ.. వార్షికంగా సుమారు 1.8 బిలియన్ డాలర్ల AI ఆదాయాన్ని సాధించామని.. ఇప్పటివరకు 5 వేలకు పైగా AI ప్రాజెక్టులపై పని చేసినట్టు వెల్లడించింది. ఇటీవల గ్లోబల్ స్థాయిలో AI వల్ల కలిగే అంతరాయాలపై ఆందోళనలతో ఐటీ స్టాక్స్ ఒడిదుడుకులకు లోనైనా.. ఈ పరిణామాలు తక్షణ కాలంలో కంపెనీ స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు మెరుగైన వేరియబుల్ పే అందిస్తున్నాయి. Infosys మూడవ త్రైమాసికంలో తన సగటు త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను 85 శాతానికి పెంచగా.. Cognizant 2025 సంవత్సరానికి 100 శాతం బోనస్ చెల్లింపును ప్రకటించింది. ఈ చర్యలు మొత్తం ఐటీ రంగంలో ఉద్యోగుల మోరల్‌ను పెంచుతున్నాయి.
అయితే వేరియబుల్ పే పెంపుతో పాటు TCS తన వర్క్‌ఫోర్స్ నిర్మాణాన్ని కూడా మార్చుకుంటోంది. FY26లో దాదాపు 2 శాతం ఉద్యోగులను.. అంటే సుమారు 12 వేల మందిని తొలగించాలనే నిర్ణయం సంస్థ తీసుకుంది. గత రెండు త్రైమాసికాల్లో పునర్నిర్మాణ చర్యల కింద సుమారు 7,800 మంది ఉద్యోగులు సంస్థను వీడగా.. మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 30 వేల వరకు తగ్గింది. ఇదే సమయంలో, AI-నేటివ్ ఫ్రెషర్లు, ట్రైనీల నియామకాన్ని రెట్టింపు చేస్తూ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, అడ్వైజరీ, కన్సల్టింగ్ వంటి భవిష్యత్ నైపుణ్యాలపై దృష్టి పెడుతోంది.
డిసెంబర్‌లో జరిగిన అనలిస్టుల సమావేశంలో TCS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన నియామకాలలో 50 శాతం కంటే ఎక్కువ మంది తదుపరి తరం నైపుణ్యాలతో వస్తున్నారని తెలిపారు. అలాగే CEO కే కృతివాసన్.. Q4, ఆ తరువాతి కాలానికి కంపెనీకి బలమైన ఆర్డర్ బుక్ ఉందని, FY27లో కూడా వృద్ధి కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాలు, H-1B వీసా విధాన మార్పుల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, TCS ఆదాయ వృద్ధిపై ఆశావహంగా ఉందని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications