ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో కంపెనీ ఏకీకృత లాభం రూ.7,008 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన లాభం రూ.8,131 కంటే 13.8 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.38,172 కోట్ల నుండి రూ.38,322 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ప్రభావం పడినట్లు వెల్లడించింది.

థర్ట్ క్వార్టర్‌కు కోలుకుంటాం
కరోనా నేపథ్యంలో ఆదాయంపై ప్రభావం పడుతుందని ముందుగా అంచనా వేశామని, లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ రంగాలు మినహా అన్ని రంగాలపై ప్రభావం ఉందని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నామని, సంస్థపై క్లయింట్స్‌కు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. థర్ట్ క్వార్టర్‌కు కోలుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బలహీన పరిస్థితులు ఉన్నాయని, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయని, అయినప్పటికీ తాము కీలక భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు.

రూ.5 డివిడెండ్
2020-21 తొలి క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం డాలర్ల రూపంలో 7.1 శాతం తగ్గింది. దీంతో ఇది 5,059 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆదాయం స్థిర కరెన్సీ ప్రకారం 6.9 శాతం తగ్గింది. కంపెనీ జూన్ క్వార్టర్ చివరలో రూ.5 మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. సమీక్ష కాలానికి కంపెనీ షేర్ 14 శాతం లాభపడింది. జూన్ 30వ తేదీ నాటికి టీసీఎస్ 5,324 పేటెంట్స్‌కు దరఖాస్తు చేసింది. ఇందులో సమీక్ష కాలంలో 108 ఉన్నాయి.

ఆఫీస్ నుండి 1 శాతం
జూన్ 30వ తేదీ నాటికి టీసీఎస్‌లో 4,43,676 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి 31, 2020 నాటికి ఈ సంఖ్య 4,48,464 గా ఉంది. ప్రస్తుతం ఒక శాతం మంది ఉద్యోగులు కార్యాలయం నుండి పని చేస్తున్నట్లు తెలిపింది. తదుపరి క్వార్టర్‌లో క్రమంగా పెంచుతామని తెలిపింది. అలాగే, 40,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని టీసీఎస్ ప్రకటించింది. ఈ హైరింగ్స్ జూలై మిడిల్ నుండి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ఇచ్చిన ఈ ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని తెలిపింది.

దురదృష్టకరం.. వారికే నష్టం
అమెరికా హెచ్1బీ వీసాలను నిషేధించడం బాధాకరమని, ఇది సరికాదని టీసీఎస్ పేర్కొంది. ఫారన్స్‌ను వెనక్కిపంపించడం అమెరికాకే నష్టం చేస్తుందని టీసీఎస్ మానవ వనరుల విభాగ గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ అన్నారు. యూఎస్ వర్సిటీల్లో పట్టాలు పుచ్చుకున్న ప్రతిభావంతులపై ఆధారపడుతున్న అక్కడి టెక్ దిగ్గజాలకు దీర్ఘకాలంలో ఇది సవాల్ అని హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. హెచ్1బీ వీసా నిలిపివేయడం దురదృష్టకరమని, అనుచిత నిర్ణయమన్నారు.


Click it and Unblock the Notifications