క్రూడాయిల్ దెబ్బ: రోజులో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌ను దాటిన TCS
కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో మార్చి 9వ తేదీన మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) పరంగా దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్‌లో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రెండో స్థానంలోకి నెట్టి వేసింది.

RILను దాటిన TCS
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్‌ను దాటినప్పటికీ, టీసీఎస్ షేర్లు కూడా లాభాల్లో ఏమీ లేవు. మధ్యాహ్నం గం.2.32 సమయంలో టీసీఎస్ షేర్ రూ.132 నష్టపోయి రూ.1,984 వద్ద ఉంది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,50,814.66 కోట్లకు పైగా ఉంది.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.7,29,998.35 కోట్లు
ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను క్రాస్ చేసిన ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. అయితే చమురు మార్కెట్ దెబ్బతో రిలయన్స్ M-Cap డిసెంబర్ 2019 రికార్డ్ హైతో పోల్చుకుంటే రూ.2.7 లక్షల కోట్లు ఆవిరైంది. మధ్యాహ్నం గం.2.39 సమయానికి రిలయన్స్ షేర్ రూ.153 తగ్గి రూ.1,118 వద్ద ఉంది. రిలయన్స్ M-Cap రూ.7,29,998.35 కోట్లుగా ఉంది.

2008 తర్వాత తొలిసారి రిలయన్స్
ఓ సమయంలో రిలయన్స్ షేర్లు 13 శాతం నుండి 15 శాతం వరకు పడిపోయి రూ.1,100 వద్ద నిలిచింది. 2008 తర్వాత తొలిసారి రిలయన్స్ షేర్ ఇంత దారుణంగా పడిపోయింది. ఇందుకు అంతర్జాతీయ చమురు మార్కెట్ ప్రభావమే. షేర్ భారీగా నష్టపోయిన సమయంలో రిలయన్స్ M-Cap రూ.6.97 లక్షల కోట్లుగా ఉంది.

గల్ఫ్ వార్ తర్వాత తొలిసారి క్రూడాయిల్
రిలయన్స్ కంపెనీ షేర్ హోల్డర్స్ సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.1 లక్ష కోట్లు ఆవిరైంది. క్రూడాయిల్ ధరలు 31 శాతం వరకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 11.31 డాలర్లు లేదా 25 శాతం తగ్గి 33.96 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 12, 2016 (31.02 డాలర్లు) తర్వాత ఇది కనిష్టం. జనవరి 17, 1991 గల్ఫ్ వార్ తర్వాత క్రూడాయిల్ ధరలు అత్యంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇంతలా పడిపోయాయి.


Click it and Unblock the Notifications