సైరస్ మిస్త్రీ పునర్నియామకం ఇష్యూ: సుప్రీం కోర్టుకెక్కిన టీసీఎస్
ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలని NCLAT ఇచ్చిన ఆదేశాలను టాటా సన్స్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీసీఎస్ వంతు. టీసీఎస్ కూడా అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. సంస్థ బోర్డులో డైరెక్టర్‌గా మిస్త్రీని పునర్నియమిస్తూ NCLAT ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పటికే టాటా సన్స్, రతన్ టాటా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం టాటా సన్స్, శుక్రవారం గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పిటిషన్లు వేయగా, జనవరి 3న సాఫ్టువేర్ దిగ్గజం, టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ NCLAT నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లింది.
జనవరి 3వ తేదీన కంపెనీ (టీసీఎస్) సుప్రీం కోర్టులో NCLAT డిసెంబర్ 18, 2019న ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేసిందని టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లు శనివారం తెలిపింది. కాగా, కోర్టుకు 6వ తేదీ వరకు సెలవులు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డిసెంబర్ 18న టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమిస్తూ NCLAT తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని అక్రమంగా పేర్కొన్నది. అయితే ఈ తీర్పుపై స్టే విధించాలని, NCLAT ఆదేశం టాటా గ్రూప్‌లోని పలు సంస్థలను అయోమయానికి గురి చేస్తోందని, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఉన్న కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తుందని టాటా సన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మిస్త్రీ నాయకత్వంలో కొరత ఉందని, ఆయన సారథ్యంలో టాటా సన్స్‌కు భవిష్యత్తు ఉండదని రతన్ టాటా పేర్కొన్నారు. ఈ నెల 9న టీసీఎస్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను వెంటనే దీనిపై విచారణ జరపాలని కోర్టును టాటా తరఫు లాయర్లు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications