వచ్చే 12నెలల నుండి 18నెలల కాలంలో భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఆదాయం, లాభాలు నెమ్మదించవచ్చునని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న టీసీఎస్‌కు బలమైన ద్రవ్యం, వివేకవంతమైన ఆర్థికవిధానాలు దాని ఆర్థిక పరిస్థితికి అండగా ఉంటూ వస్తున్నాయి. కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ వృద్ధి అంచనాలను పాజిటివ్ నుండి స్థిరత్వానికి మార్చినట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. లాంగ్ టర్మ్‌గా కొనసాగుతున్న 'ఏ' రేటింగ్ కొనసాగించినట్లు వెల్లడించింది.

ప్రపంచ వృద్ధి రేటు డౌన్, ఐటీ వ్యయం తగ్గుదల
రానున్న 12 నెలల కాలం నుండి 24 నెలల కాలానికి టీసీఎస్ తన బలమైన స్థానాన్ని అదే స్థాయిలో కొనసాగిస్తుందని, క్యాష్ హోల్డింగ్స్, బలమైన ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నేపథ్యంలో స్థిరమైన దృక్పథాన్ని అంచనా వేస్తున్నట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచ జీడీపీ 3.5 శాతం మేర క్షీణిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే గ్లోబల్ ఐటీ స్పెండింగ్స్ కూడా 4 శాతం మేర తగ్గిపోవచ్చునని తెలిపింది.

వృద్ధి రేటు పతనం!
2021 మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ రెవెన్యూ కేవలం 0 నుండి 1 శాతం మాత్రమే పెరుగుదలను నమోదు చేస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 5.3 శాతంగా ఉండటం గమనార్హం. ఈ లెక్కన వృద్ధి రేటు దాదాపు పతనమైనట్లే భావించవచ్చు. కొత్త కాంట్రాక్టులు, రెన్యూవల్స్‌పై ధరల ఒత్తిడి ఉంటుందని భావిస్తోంది. ఎందుకంటే ఇది పోటీ మార్కెట్ అని గుర్తు చేసింది.

ఆ రంగాలకు రెండు మూడేళ్లు..
అదే సమయంలో ఆన్‌సైట్ వనరుల్లో టీసీఎస్ పెట్టుబడులు కొనసాగనున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ తెలిపింది. గత రెండేళ్లలో కంపెనీ మార్జిన్ రేంజ్ 27-28 శాతంగా ఉండగా, వచ్చే రెండేళ్లలో 25 నుండి 27 శాతంగా ఉండనుందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా, రిటైల్, ట్రావెల్, హాస్పిటాలిటీ, మీడియా రంగాలు కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్నాయని, పూర్వస్థాయికి కోలుకోవడానికి రెండు మూడేళ్లు పట్టవచ్చునని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications