బెంగళూరులో TCS భారీ లీజు ఒప్పందం.. రూ.975 కోట్ల అద్దెతో కొత్త ఆఫీసు
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS), బెంగళూరులోని సత్వ నాలెడ్జ్ పాయింట్ లో భారీ స్థాయిలో వాణిజ్య కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్ ద్వారా లభించిన పత్రాల ప్రకారం.. టీసీఎస్ దాదాపు 17.52 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఐదు సంవత్సరాలపాటు రూ.975 కోట్ల అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
TCS టవర్ A, టవర్ B లలో మూడు అంతస్తులను లీజుకు తీసుకున్నట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. నెలవారీ అద్దె దాదాపు రూ.15.37 కోట్లు. చదరపు అడుగుకు రూ. 87.73 రేటుగా నిర్ణయించబడింది. కంపెనీ ఈ లావాదేవీకి గాను రూ. 25 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. లీజు ఒప్పందంలో ప్రతి మూడు సంవత్సరాలకు 14 శాతం ఎస్కలేషన్ క్లాజ్ చేర్చబడింది. అదనంగా మరో ఐదు సంవత్సరాలపాటు పొడిగించే అవకాశం కూడా ఉంది.
సత్వ నాలెడ్జ్ పాయింట్‌లోని టీసీఎస్ లీజు, స్కేల్ (1.75 మిలియన్ చదరపు అడుగులు) మరియు వార్షిక అద్దె నిబద్ధత పరంగా బెంగళూరులోని అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేక పెద్ద టెక్ సంస్థలు ఇలాంటి లీజులు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం, బెంగళూరును దేశంలోని ప్రీమియం ఐటీ హబ్‌గా మరింత బలపరుస్తుందని ప్రాప్‌స్టాక్ సహ వ్యవస్థాపకుడు రాజా సీతారామన్ అన్నారు.

ఇది టీసీఎస్‌కు బెంగళూరులో మొదటి ఒప్పందం కాదు. గతంలో కూడా కంపెనీ ఎలక్ట్రానిక్ సిటీలోని 360 బిజినెస్ పార్క్‌లో 1.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని 15 సంవత్సరాలకు రూ.2,130 కోట్లకు లీజుకు తీసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం టీసీఎస్ టవర్ 5Aలో 6.8 లక్షల చదరపు అడుగులు, టవర్ 5Bలో 7.2 లక్షల చదరపు అడుగులు ఆక్యుపై చేసింది. చదరపు అడుగుకు రూ.66.5 చొప్పున, నెలకు రూ.9.31 కోట్లు అద్దె చెల్లిస్తోంది. ఈ ఒప్పందానికి గాను రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది.
అంతేకాక ఈ ఏడాది మార్చిలో చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్‌లో 6.3 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని టీసీఎస్ లీజుకు తీసుకుంది. నెలవారీ అద్దె రూ.2.8 కోట్లు. అదేవిధంగా, ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పారాడిగ్మ్ రాజపుష్పలో 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను నెలకు రూ.4.3 కోట్లకు లీజుకు తీసుకుంది.
ఒకవైపు టీసీఎస్ ఉద్యోగుల సంఖ్యలో 12 వేల మందిని తగ్గించే ప్రణాళికలు ప్రకటించినా, మరోవైపు పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది కంపెనీ దీర్ఘకాల వృద్ధి వ్యూహం, రాబోయే ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications