IT News: FY23లో నియామకాలు తగ్గించిన TCS, ఇన్ఫోసిస్.. ఇప్పటికీ ముందుకు కదలని హైరింగ్
IT News: ప్రస్తుతం ఉద్యోగార్థుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఓ పక్క భారీ లేఆఫ్ లతో కంపెనీలు సిబ్బంది భారాన్ని తగ్గించుకుంటున్నాయి. మరోపక్క దిగ్గజ సంస్థలు సైతం కొత్త నియామకాల ప్రక్రియను ప్రారంభించకుండా నెమ్మదిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో జాబ్ హంటర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల గూగుల్, అమెజాన్ లు మరోసారి లేఆఫ్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా TCS, ఇన్ఫోసిస్ సహా వివిధ IT కంపెనీలు నియామకాలను నెమ్మదించాయి. US మరియు యూరప్ వంటి మార్కెట్లలో టెక్నాలజీ డిమాండ్ అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లోని స్థూల ఆర్థిక సవాళ్లతో పాటు భౌగోళిక, రాజకీయ సమస్యలూ నియామక ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

దేశంలోని రెండు అగ్రశ్రేణి IT సంస్థలు ఇన్ఫోసిస్, TCSలు అంతకు ముందుతో పోలిస్తే FY23కి గాను నియామకాల్లో మూడింట రెండు వంతులు తగ్గించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. FY22తో గతేడాది తేడాని గమనిస్తే, అప్పట్లో ఈ కంపెనీలు 1.5 లక్షలకు పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరం 50 వేల మందిని మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక చివరి త్రైమాసికంలో అయితే TCS కేవలం 821 మందిని మాత్రమే చేర్చుకోవడం విశేషం.
దేశంలో రెండవ స్థానంలో ఉన్న IT సంస్థ ఇన్ఫోసిస్ సైతం తన హెడ్ కౌంట్‌లో 3 వేలకు పైగా క్షీణతను నివేదించింది. విదేశాల్లో సాంకేతికతపై వ్యయం తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరగడం వల్లే ఈ పరిస్థితి తెలెత్తినట్లు ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వీటికి తోడు మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో IT దిగ్గజాలు అంచనాల కంటే తక్కువ వృద్ధిని నమోదు కావడంతో.. నియామకాల కంటే కూడా కార్యకలాపాలను గాడిన పెట్టే పనిలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications