Hiring News: ఐటీ ఉద్యోగులకు షాక్! దారుణంగా పడిపోతున్న నియామకాలు! అసలు కారణం ఇదే..
భారతీయ ఐటీ రంగంలో నియామకాల పర్వం (Hiring news) ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 2026 ఆర్థిక సంవత్సరానికి (FY26) సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీలైన టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో , టెక్ మహీంద్రా తమ ఉద్యోగుల సంఖ్యను పెంచడం పక్కన పెట్టి, ఏకంగా 7,389 మందిని తగ్గించుకున్నాయి. గత ఏడాది స్వల్పంగా పెరిగిన నియామకాలు, ఈ ఏడాది మళ్లీ నెగటివ్ జోన్‌లోకి వెళ్లడం ఐటీ నిపుణులను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం , బిజినెస్ రీస్ట్రక్చరింగ్ వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

టీసీఎస్ నుంచి అతిపెద్ద లేఆఫ్స్ (Layoffs)!
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ ఉపాధి సంస్థ అయిన టీసీఎస్ (TCS) నుంచి సుమారు 12,000 మంది ఉద్యోగులు తప్పుకోవడం ఈ ఏడాది అతిపెద్ద షాకింగ్ న్యూస్. ఇటీవలి కాలంలో ఒక భారతీయ కార్పొరేట్ సంస్థలో జరిగిన అతిపెద్ద ఉద్యోగ కోత ఇదే కావడం గమనార్హం. దీనివల్ల ఐటీ పరిశ్రమలో నియామకాల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే, క్యూ4 (Q4FY26) లో మాత్రం టీసీఎస్ కొత్తగా 2,356 మందిని చేర్చుకోగా, ఇన్ఫోసిస్ 8,440 మందిని, టెక్ మహీంద్రా 1,993 మందిని కోల్పోయింది.
ఫ్రెషర్లకు బ్యాడ్ న్యూస్ తప్పదా?
కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ వైపు అడుగులు వేస్తున్న ఫ్రెషర్లకు ఈసారి గడ్డుకాలం అనే చెప్పాలి. నియామకాల వార్తలు (Hiring news) ఏమంత ఆశాజనకంగా లేవు.
- TCS: గతంలో 40 వేల మందికి పైగా తీసుకున్న టీసీఎస్, 2027 ఆర్థిక సంవత్సరానికి కేవలం 25,000 మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకుంటామని ప్రకటించింది.
- Infosys: ఈ సంస్థ కూడా 20,000 మందిని మాత్రమే తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.
- Wipro & Others: విప్రో , టెక్ మహీంద్రా వంటి కంపెనీలు అసలు టార్గెట్లు ప్రకటించడానికే భయపడుతున్నాయి. మార్కెట్ డిమాండ్ ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి.
అసలు కంపెనీలు ఏమంటున్నాయి?
టెక్ మహీంద్రా సీఎఫ్ఓ రోహిత్ ఆనంద్ మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం ఉద్యోగుల వినియోగ సామర్థ్యాన్ని (Utilization rate) పెంచడంపై దృష్టి పెట్టామని, అందుకే కొత్త నియామకాల్లో వేగం తగ్గించామని చెప్పారు. అటు టీసీఎస్ హెచ్ఆర్ సుదీప్ కుంజుమల్ ప్రకారం.. కంపెనీ ఇప్పుడు డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ , AI లో నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. అంటే సాదాసీదా సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కంటే అత్యాధునిక టెక్నాలజీ తెలిసిన వారికే ఇకపై అవకాశాలు దక్కనున్నాయి.
మొత్తంగా చూస్తే, నాస్కామ్ (Nasscom) రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన దాదాపు స్తంభించిపోయింది. ఉద్యోగుల సంఖ్య పెరగడం కంటే ఉన్నవారితోనే పనిని పూర్తి చేయడం (Rationalizing headcount) పై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది (FY27) కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని కంపెనీ మేనేజ్‌మెంట్లు దాటవేస్తుండటం నిరుద్యోగుల్లో టెన్షన్ పెంచుతోంది. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ఒక్కటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ముందున్న మార్గం.


Click it and Unblock the Notifications