సైబర్ దాడి: టీసీఎస్, హెచ్‌సీఎల్‌కు షాక్! ఉద్యోగుల డేటా లీక్?
భారత్‌లోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు సైబర్ దాడి ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు అందాయి. ఉద్యోగుల ప్రాథమిక డేటా లీక్ కావొచ్చనే సమాచారంతో సోమవారం ఈ రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన యాజమాన్యాలు, తమ సిస్టమ్స్‌ను పూర్తిగా సమీక్షించి, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తున్నాయి.
ఏఐ యుగంలో సైబర్ సెక్యూరిటీ ఎంత కీలకమో ప్రతిరోజూ అర్థమవుతూనే ఉంది. ఇలాంటి సమయంలో, లక్షలాది మంది టెక్ ఉద్యోగులు పనిచేసే సంస్థలపై ఇలాంటి దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ విషయంపై హెచ్‌సీఎల్ టెక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఒక ప్రకటన విడుదల చేసింది. సైబర్ దాడి ఆరోపణలపై తమ డిజిటల్ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఈ దాడిలో లీకైనట్లు చెబుతున్న సమాచారం చాలా పాతదని తేలిందని తెలిపింది. అంతేకాదు, ఇది చాలా చిన్న స్థాయి దాడి అని స్పష్టం చేసింది.

ఈ దాడి వల్ల తమ కంపెనీ వ్యవస్థలకు గానీ, తమ క్లయింట్ల సిస్టమ్స్‌కు గానీ ఎలాంటి నష్టం జరగలేదని భరోసా ఇచ్చింది. అయినప్పటికీ, సైబర్ దాడిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం తమ ప్రాధాన్యత అని కంపెనీ పేర్కొంది.
ఇక టీసీఎస్ కూడా దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. సైబర్ దాడికి ఆస్కారం ఉందని తేలినప్పటికీ, దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఈ ఘటన వల్ల టీసీఎస్ లేదా క్లయింట్ల వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపింది.
ఒకవేళ డేటా లీక్ అయి ఉంటే, అది 4 ఏళ్ల నాటి పాత క్లయింట్ డేటా అయి ఉంటుందని, అలాగే చాలా తక్కువ మంది ఉద్యోగుల డేటా మాత్రమే చోరీకి గురై ఉండవచ్చని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.
భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ప్రపంచంలోని అనేక దేశాల నుంచి సైబర్ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, కరోనా మహమ్మారి తర్వాత ఈ దాడుల సంఖ్య పెరిగింది. దీంతో భారత కంపెనీలు తమ సైబర్ భద్రతా వ్యవస్థలను భారీ స్థాయిలో మెరుగుపరుచుకున్నాయి.
ఈ కారణంగా, గత కొన్నేళ్లుగా సైబర్ దాడుల ఘటనలు తగ్గుముఖం పట్టాయి. న్యూస్9 నివేదిక ప్రకారం, భారత వెబ్‌సైట్లపై ఎక్కువగా చైనా, పాకిస్థాన్ నుంచే సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications