టీసీఎస్ నిఘా: ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో ఏం జరుగుతోంది? కంపెనీ వివరణ!
భారత్‌లోని టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ (TCS), తమ ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించే విధానాన్ని మెరుగుపరచాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, కంపెనీలో పనిచేస్తున్న 6 లక్షల మంది ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో 'డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్ టూల్' అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ ప్రకటన టీసీఎస్ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. ఇటీవలే మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ కూడా, ఉద్యోగుల మౌస్, కీబోర్డ్ కదలికలను ఉపయోగించి వారి ఉత్పాదకతను (productivity) కొలిచే కొత్త టూల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఇప్పుడు కాగ్నిజెంట్ బాటలోనే టీసీఎస్ కూడా ఉద్యోగులను పర్యవేక్షించాలని నిర్ణయించుకుంది. మరి టీసీఎస్ ఇన్‌స్టాల్ చేయబోయే ఈ టూల్ ద్వారా ఏయే విషయాలను ట్రాక్ చేయనుందనే దానిపై కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

టీసీఎస్ యాజమాన్యం తమ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని ల్యాప్‌టాప్‌లలో ఈ కొత్త టూల్‌ను ఇన్‌స్టాల్ చేయనుంది. ఈ టూల్ ద్వారా ప్రతి ఉద్యోగి ఏయే అప్లికేషన్లు వాడుతున్నారు, వాటిని ఎంత సేపు ఉపయోగిస్తున్నారు వంటి సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పర్యవేక్షణ ద్వారా టీసీఎస్ యాజమాన్యం రెండు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని చూస్తోంది. మొదటిది, డేటా దొంగతనం (information theft) మరియు సమాచారం బయటకు లీక్ అవ్వకుండా నిరోధించడం. దీనివల్ల కంపెనీ భద్రతను భారీగా మెరుగుపరచవచ్చు. ఇక రెండోది, ఉద్యోగులకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌లలో వారి కార్యకలాపాలను పర్యవేక్షించడంపై పూర్తి నియంత్రణ లభిస్తుంది.
ఇప్పటికే ఏఐ (AI), ఆటోమేషన్ కారణంగా తీవ్రమైన పనిభారం, ఉద్యోగ అభద్రతతో సతమతమవుతున్న భారత ఐటీ ఉద్యోగులకు ఇలాంటి నిఘా మరింత ఆందోళన, ఒత్తిడిని కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరును రకరకాలుగా పర్యవేక్షిస్తూనే ఉన్నాయి.
అయితే, ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మరోవైపు, టీసీఎస్ ఈ టూల్‌ను ఉపయోగించడానికి అసలు కారణం వేరే ఉండొచ్చని EIIRTrend సంస్థ సీఈఓ ప్రతీక్ జైన్ అభిప్రాయపడ్డారు. టీసీఎస్ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవడానికే దీన్ని వాడుతుండవచ్చని ఆయన తెలిపారు.
ఇటీవల టీసీఎస్, Zscaler అనే సంస్థతో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 'వర్క్‌స్పేస్ ఎక్స్‌పీరియన్స్ స్టూడియో'ను ప్రారంభించడం గమనార్హం.
అయితే, మానిటరింగ్ టూల్ ద్వారా ఉద్యోగులపై నిఘా పెడుతున్నారంటూ వచ్చిన వార్తలను టీసీఎస్ పూర్తిగా ఖండించింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని టీసీఎస్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications