IT News: గడచని కొన్ని నెలలుగా దేశంలోని టెక్ ఉద్యోగులు అనేక ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వ్యాపారాల్లో వస్తున్న నూతన మార్పులు దీనికి కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే ఇది అనేక రంగాల్లో ఉద్యోగు కోతలను ప్రేరేపిస్తూ భయాలను పెంచుతోంది. ప్రస్తుతం టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు దీనిని ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అనుభవం ఉన్న పరిమిత సంఖ్యలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉండటం వల్ల భారతీయ ఐటీ కంపెనీలు ఈ రంగంలో ఎక్కువ ప్రాజెక్టులను చేపట్టలేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది.

ఈ పరిస్థితిలో ఇండియాలోని అతిపెద్ద ఐటీ సేవలు, సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా ఉన్న టాటాలకు చెందిన TCS తన 5 లక్షలకు పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు టెక్ పరిశ్రమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Gen AI) రంగంలో పని చేసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తమ వద్ద పనిచేస్తున్న టెక్కీలకు తగిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.
ఇటీవలి క్వార్టర్లీ ఫలితాలను విశ్లేషిస్తే డిసెంబర్ ముగిసే నాటికి టెక్ దిగ్గజం వద్ద మెుత్తంగా 6,03,305 మంది ఉద్యోగులు ఉన్నారు. జనరేటివ్ ఏఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనికి తోడు అప్లికేషన్ ప్రాంతాలు చిన్నవిగా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇది చాలా ముఖ్యమైన రంగం కానుందని TCSలో ఇటీవల ఏర్పాటైన AI.Cloud విభాగం అధిపతి శివ గణేశన్ అన్నారు.
ప్రస్తుతం 250 ఉత్పాదక AI ప్రాజెక్ట్‌లపై పనిచేస్తున్నట్లు టీసీఎస్ కొన్ని నెలల కిందట ప్రకటించింది. భవిష్యత్తులో AI అవసరాలకు అధిక డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున TCS ఇప్పుడు ఈ టెక్నాలజీపై పెట్టుబడి పెడుతోంది. టీసీఎస్ ఏఐ.క్లౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ శివ గణేశన్ మాట్లాడుతూ ఉద్యోగులను ఏఐ నైపుణ్యంతో సన్నద్ధం చేయడంతోపాటు సరైన కంపెనీలతో భాగస్వాములుగా మార్చటం ఈ ప్రయాణంలో తొలి అడుగని అన్నారు.


Click it and Unblock the Notifications