TCS News: ఉద్యోగుల ఆఫీస్ హాజరుపై TCS చీఫ్ HR హ్యాపీ.. ఆ నిర్ణయమే సక్సెస్ మంత్ర..
IT News: ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యాలయాలకు తిరిగిరావాలని ఇటీవల హుకుం జారీచేసింది. దీంతో ఇదే రంగంలోని ఇతర ప్లేయర్స్ కూడా అలర్ట్ అయ్యి, TCS బాటలోనే నడవాలని ప్రయత్నించాయి. కానీ సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను ఎదుర్కోలేక కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ TCS మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు విడవడం లేదు.
ఇదే విషయంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ HR ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'వేరియబుల్ పే'ను ఉద్యోగుల హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. దాదాపు 70 శాతం సిబ్బంది తిరిగి విధుల్లోకి చేరారని తెలిపారు. అయితే ఇప్పటికీ దీన్ని తాత్కాలిక చర్యగానే చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రతివారం ఈ సంఖ్య పెరుగుతూ వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఆఫీసులకు వచ్చే ఆవశ్యకతను ఉద్యోగులు అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యోగులకు చెల్లించే త్రైమాసిక వేరియబుల్ పేను TCS ఏప్రిల్ 2024లో వారి కార్యాలయ హాజరుతో జతపరిచింది. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు సదరు బోనస్‌కు అర్హులు కాదని నిబంధన విధించింది. సిబ్బంది తప్పనిసరిగా వారానికి 5 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని గతంలో ఆదేశించింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ పాలసీని అప్‌డేట్ చేసి అటెండెన్స్ లింక్ చేసింది.
కాగా కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ పే పొందేందుకు అర్హత సాధించాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి.
75-85 శాతం మేర కార్యాలయ హాజరు ఉన్న సిబ్బంది వేరియబుల్ పేలో 75 శాతం పొందుతారు. 60-75 శాతం రేంజ్‌లో ఉంటే కేవలం 50 శాతానికి మాత్రమే అర్హత లభిస్తుంది. అయితే దీన్ని కంటిన్యూగా పాటించడంలో విఫలమైతే మాత్రం TCS సదరు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications