TCS Hiring: టెక్ ఫ్రెషర్లకు లక్కీఛాన్స్.. టీసీఎస్ 40,000 మంది మెగా రిక్రూట్మెంట్
TCS News: ఇటీవల రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత దేశీయ టెక్ దిగ్గజం మరో తీపికబురు చెప్పింది. హెచ్‌సీఎల్ మాదిరిగానే కొత్తగా ఫ్రెషర్లను భారీగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
ప్రతికూల వ్యాపార పరిస్థితుల్లో వెలుగు దివ్వెగా టీసీఎస్ మారింది. అతిపెద్ద నిర్ణయంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్లకు శుభవార్త అందించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్న తరుణంలో కొత్త నియామకాలు చేపడతామంటూ సంచలన ప్రకటన చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

దీనిలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్ నియామకాల రూపంలో 40 వేల మంది టెక్ ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని కంపెనీ యోచిస్తోందని టీసీఎస్ సీఈవో ఎన్ గణపతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్‌కు వెళ్లే ఆలోచనలో తాము లేమంటూ గతవారం టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది ఇన్ఫోసిస్ దాదాపు 50,000 మందిని నియమించుకున్నట్లు CFO నిలంజన్ రాయ్ ఇటీవలే వెల్లడించారు. వారికి అందించిన ఆఫర్ లెటర్లను తప్పకుండా గౌరవిస్తామని తెలిపింది.
గడచిన 12-14 నెలలుగా కంపెనీ వ్యాపారంలో భారీ క్షీణతను చూసిందని ఎన్ గణపతి సుబ్రమణ్యం అన్నారు. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం దాదాపు 9% పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. సవాలుతో కూడిన వ్యాపార వాతావరణంలో కొత్త డీల్స్ పొందటం లాభదాయకతను పెంచడంలో సహాయపడిందని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే ఒక్కో షేరుపై రూ.9 ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications