90 Hours Work: ఎల్‌అండ్‌టి ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్‌ను సమర్థించిన టీసీఎస్ సీఈవో.. 90 గంటల పనిపై ఇలా..
TCS CEO Krithivasan: చాలా దేశాల్లో వారానికి మూడు లేదా నాలుగు రోజులు పని విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇండియాలో మాత్రం పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పెద్ద కంపెనీలను నడిపిస్తున్న వెటరన్ లీడర్లు కూడా 70 నుంచి 90 గంటలు వారానికి పనిచేయాలని సూచించటం పెద్ద చర్చకు దారితీసింది.
ముందుగా పని గంటలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి కీలక కామెంట్స్ సంగతి తెలిసిందే. తన దృష్టిలో భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని, అప్పుడే ఇండియా పొరుగున ఉన్న చైనాలాంటి దేశాలతో అభివృద్ధి విషయంలో పోటీగలదని చెప్పారు. తాను వారానికి 5 రోజల పనికి మారటంపై కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అయితే చివరికి ఇటీవల ఈ అంశంపై మాట్లాడుతూ ఎన్ని గంటలు పనిచేయాలనేది వ్యక్తిగతమైన నిర్ణయమని, కెరీర్ లో వారు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే దానిబట్టి ఒక్కొక్కరి నిర్ణయాలు ఉంటుంటాయని పేర్కొన్నారు.

అయితే నారాయణమూర్తి కామెంట్స్ ప్రకంపనలు ముగిసిపోకమునుపే.. దేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న ఎల్‌అండ్‌టి ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఆదివారాలు కూడా పనిచేయాలని, వారానికి ఉద్యోగులు 90 గంటలు పనికి కేటాయించాలని చేసిన కామెంట్స్ దావానలంగా రగులుతున్నాయి. మెజారిటీ ఉద్యోగులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కానీ కొందరు ఇండస్ట్రీ లీడర్లు మాత్రం సుబ్రహ్మణ్యన్ చెప్పిన దానిలో తప్పేముందన్నట్లుగా సమర్థిస్తున్నారు.
తాజాగా టీసీఎస్ సీఈవో క్రితివాసన్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పని నీతిపై సుబ్రహ్మణ్యన్ వంటి అనుభవజ్ఞుల వ్యాఖ్యల "స్పిరిట్"ని అర్థం చేసుకోవాలని కోరారు. సుదీర్ఘ పని గంటల సూచనలను సందర్భోచితంగా తీసుకోవద్దని అన్నారు. ఇక్కడ ఎన్ని గంటలు పనిచేస్తున్నామనే విషయం తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్న అంశంగా ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో క్రితివాసన్ తాను పనిచేస్తున్న సమయంలో కొన్ని వారాలు 60 గంటలు పనిచేశానని, మరికొన్ని వారాలు కేవలం 40 గంటలు మాత్రమే పనిచేసినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పనిలో కొనసాగుతున్నప్పుడు కొంతకాలానికి ఉద్యోగులు వారి స్వంత సమతుల్యతను కనుని, సంతోషంగా ఉంటారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications