తిరుపతి డిస్‌ప్లే తయారీ ప్లాంట్‌పై టీసీఎల్ కీలక నిర్ణయం..మెజారిటీ వాటాను అమ్మకానికి పెట్టిన చైనా దిగ్గజం..
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ (TCL).. ఆంధ్రప్రదేశ్‌లోని తన డిస్‌ప్లే తయారీ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, స్థానిక భాగస్వామ్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఉన్న ఈ తయారీ యూనిట్‌లో 51% వాటాను విక్రయించడం ద్వారా సుమారు 600 నుండి 800 మిలియన్ డాలర్ల (సుమారు ₹5,708 నుండి ₹7,611 కోట్లు) నిధులను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ఒప్పందం కోసం టీసీఎల్ ఇప్పటికే స్టాండర్డ్ చార్టర్డ్‌ను తన ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది.
తిరుపతిలోని ఈ ప్లాంట్ భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత కీలకమైనది. ఇది దేశంలోనే ఏకైక ఓపెన్-సెల్' (Open-cell) తయారీ యూనిట్ కావడం విశేషం. ఓపెన్-సెల్ అనేది టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమోటివ్ స్క్రీన్‌ల తయారీలో ఉపయోగించే అత్యంత ప్రధానమైన భాగం. చైనా వెలుపల టీసీఎల్ సంస్థకు ఉన్న అతిపెద్ద ప్లాంట్ ఇదే. ఇక్కడ ఏడాదికి 8 మిలియన్ల టీవీ ప్యానెళ్లు, 30 మిలియన్ల మొబైల్ డిస్‌ప్లేలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంట్ కోసం మొదటి దశలో కంపెనీ ఇప్పటికే రూ. 1,800 కోట్ల పెట్టుబడి పెట్టింది.

ఈ వాటాను కొనుగోలు చేసేందుకు భారతదేశంలోని పలు ప్రముఖ కంపెనీలు రేసులో ఉన్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ, ఈప్యాక్ డ్యూరబుల్స్, యూనో మిండా వంటి సంస్థలతో టీసీఎల్ చర్చలు జరుపుతోంది. అయితే, హవెల్స్ ఇండియా వంటి కొన్ని కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదు. టీసీఎల్ తన వ్యూహంలో భాగంగా ఇద్దరు భాగస్వాములను చేర్చుకోవాలని చూస్తోంది. ఒకరు కార్యకలాపాలను పర్యవేక్షించే వ్యూహాత్మక భాగస్వామి కాగా, మరొకరు ఆర్థిక పెట్టుబడిదారు.
టీసీఎల్ అనుసరిస్తున్న ఈ విధానం ఇటీవల హైయర్ (Haier) ఇండియా చేపట్టిన వాటా విక్రయ నమూనాను పోలి ఉంది. హైయర్ తన స్థానిక యూనిట్‌లో 49 శాతం వాటాను భారతీ ఎంటర్‌ప్రైజెస్, వార్‌బర్గ్ పింకస్‌లకు విక్రయించి, అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. టీసీఎల్ కూడా తన వద్ద 49 శాతం వాటాను ఉంచుకొని, మిగిలిన 51 శాతం వాటాను భారతీయ కొనుగోలుదారులకు అప్పగించడం ద్వారా తన వ్యాపారాన్ని స్థానికీకరించాలని భావిస్తోంది. ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయని, రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల భారతదేశంలో డిస్‌ప్లే తయారీ రంగం మరింత బలోపేతం కానుంది.


Click it and Unblock the Notifications
