TBO Tek IPO: దేశీంలో ఇటీవల వస్తున్న ఐపీవోలు మార్కెట్లో అసలు ఇష్యూని ప్రారంభించకముందే ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈక్విటీ మార్కెట్లను వదిలేసి ఒడిదొడుకుల్లో సైతం ఐపీవోలపైనే బెట్టింగ్ కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మే 8న ఇష్యూ ప్రారంభించనున్న టీబీఓ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.1,550.81 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.875-920గా నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మే 8న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 16గా నిర్ణయించింది. ఈ లెక్కన ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పాల్గొని బెట్టింగ్ వేయాలనుకుంటే అందుకోసం కనీసం ఒకలాట్ కొనేందుకు రూ.14,720 వెచ్చించాల్సి ఉంటుంది.

ఐపీవో ద్వారా కంపెనీ 43 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఇదే సమయంలో కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద 1.25 కోట్ల షేర్లను సైతం విక్రయిస్తోంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈతో పాటు బీఎస్ఈలో ఏకకాలంలో అరంగేట్రం చేయనున్నాయి. ఇన్వెస్టర్స్ గెయిన్ నివేదిక ప్రకారం కంపెనీ షేర్లు ఇష్యూకి ముందరే గ్రేమార్కెట్లో ఒక్కొక్కటి రూ.395 ప్రీమియం వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అంటే ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ షేర్లను పొందినట్లయితే లిస్టింగ్ రోజున కంపెనీ షేర్లు రూ.1315 రేటుకు జాబితా అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన లిస్టింగ్ నమైదైతే తొలిరోజే ఇన్వెస్టర్లు ఏకంగా షేరుకు 42 శాతం రాబడిని అందుకుంటారని తెలుస్తోంది.
ఐపీవోలో పాల్గొన్న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ మే 14న ఉంటుండగా.. మే 15న మార్కెట్లో షేర్లు జాబితా అవనున్నాయి. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లైన అంకుష్ నిజవాన్, గౌరవ్ భట్నాగర్, మనీష్ ధింగ్రా, అర్జున్ నిజవాన్ ఐపీవోకి ముందర కంపెనీలో 51.26% వాటాను హోల్డ్ చేస్తున్నారు. 2006లో స్థాపించబడిన కంపెనీ వాస్తవానికి ట్రావెల్ వ్యాపారంలో ఉంది. ఇది ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లాట్ ఫారమ్. విదేశీ ప్రయాణాలు చేసే వ్యక్తులకు కరెన్సీ కన్వర్షన్ సేవలను అందిస్తోంది. ఇది ట్రావెల్ రంగంలో ఉన్న అన్ని రకాల కంపెనీలతో పాటు ట్రావెల్ ఏజెంట్లు, వ్యక్తులు, సంస్థలు, సూపర్ యాప్స్, ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీలకు సైతం ఏకకాలంలో సేవలను అందిస్తోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.501.21 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications