Air India Express: టాటా గ్రూప్ ఏవియేషన్ వ్యాపారం అతిపెద్ద కుదుపులకు లోనవుతోంది. ఒకదాని తర్వాత మరొక కంపెనీలో ఉద్యోగులు వరుస సిక్ లీవ్ పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో టాటా గ్రూప్ తన విమాన సేవలను భారీగా క్యాన్సిల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే గత కొంత కాలంలో విస్తారా పైలెట్లు తమ వేతన సవరింపులకు నిరసనగా సిక్ లీవ్ పెట్టడం కంపెనీ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీసింది. ఈ క్రమంలో టాటా గ్రూప్ అనేక విమాన సర్వీసులను రద్దు చేయటంపై రెగ్యులేటర్ డీజీసీఏ సైతం వివరణ కోరింది. అయితే ఇప్పుడు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లోనూ సమస్యలు మెుదలయ్యాయి. కంపెనీలోని క్రూ ఉద్యోగులు ఏకకాలంలో అనారోగ్య కారణాలు చూపుతూ సెలవు తీసుకోవటంతో 70 విమాన సేవలను కంపెనీ నిలిపేసినట్లు వెల్లడైంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 70కి పైగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తమ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగం గత రాత్రి నుండి చివరి నిమిషంలో అనారోగ్యంతో ఉన్నట్లు తెలియటంతో కొన్ని విమానసేవలను ఆలస్యంగా నిర్వహిస్తుండగా, మరికొన్ని ఏకంగా రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే దీనివెనుక కారణాలను తెలుసుకునేందుకు సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని వీలైనంత త్వరగా తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో టికెట్ కాన్సిల్ అయిన వారికి రీఫండ్ తో పాటు కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యప్రాచ్య నగరాలకు అనేక విమాన సేవలను రద్దు చేసింది. దీనిపై వందలాదిమంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి తాజా టిక్కెట్లు లేదా వెంటనే రీఫండ్‌లను డిమాండ్ చేశారు. విమానాల రద్దు కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం షార్జా, దామామ్, మస్కట్, బహ్రెయిన్ నుంచి కొచ్చిలో దిగాల్సిన విమానాలు కూడా రద్దు చేయబడినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications