టాటా గ్రూపు వార్‌లో బిగ్ ట్విస్ట్.. మెహ్లి మిస్త్రీకి వ్యతిరేకంగా ముగ్గురు ఓటు.. బోర్డు నుండి వైదొలుగుతారా..
టాటా గ్రూపులో వార్ ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూపు అంతర్గత రాజకీయాలతో నలిగిపోతోంది. బోర్టులోని మెంబర్లకు ఒకరికి ఒకరంటే పొసగడం లేదు. తాజాగా దివంగత రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మెహ్లీ మిస్త్రీ, టాటా ట్రస్ట్స్ బోర్డు నుండి తప్పుకుంటున్నారని అక్టోబర్ 28న వెలువడిన నివేదికలు వెల్లడించాయి. చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ విజయ్ సింగ్ లు Mehli Mistry పునర్నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో మిస్త్రీ బోర్డు నుండి వైదొలిగే అవకాశం ఉందని సమాచారం.
CNBC-TV18, మనీ కంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం మెహ్లీ మిస్త్రీ పదవీకాలాన్ని పునరుద్ధరించాలనే ప్రతిపాదనను ముగ్గురు ట్రస్టీలు వ్యతిరేకించారు. దీంతో ఆయన టాటా ట్రస్ట్‌లలో కొనసాగడం అసాధ్యమని అనధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం ఏది బయటకు రాలేదు. కాని జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ పరిణామం టాటా ట్రస్టుల్లో అంతర్గత పాలిటిక్స్ ను బయటపెడుతోంది. సాధారణంగా ట్రస్టులలో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకునే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఈసారి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రస్టుల పాలనా చట్రం ప్రకారం ట్రస్టీని తిరిగి నియమించాలంటే అందరు సభ్యుల అంగీకారం తప్పనిసరి. నియామకాన్ని అడ్డుకోవడానికి ఒకే ఒక్క వ్యతిరేక ఓటు సరిపోతుంది. ఇదే నిబంధన ఈసారి అమలులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
2022లో టాటా ట్రస్ట్‌ల నాయకత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మెహ్లీ మిస్త్రీ బోర్డులో చేరారు. దీని ఉద్దేశ్యం పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడం, టాటా గ్రూప్ యొక్క వ్యూహాత్మక, దాతృత్వ లక్ష్యాలతో ట్రస్టులను మరింత దగ్గరగా సమన్వయం చేయడం. రతన్ టాటా యొక్క సుదీర్ఘ నమ్మకస్థుడిగా ఉన్న మిస్త్రీ నియామకం, అనుభవజ్ఞులైన వ్యక్తులను ట్రస్ట్‌ల నిర్ణయాత్మక స్థాయికి తీసుకురావాలన్న ఆలోచనకు ప్రతీకగా భావించబడింది.
అయితే ఆయనకు షాపూర్జీ పల్లోంజీ (SP) గ్రూప్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గతంలో వివాదాస్పదంగా మారింది. 2016లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత, టాటా గ్రూప్- SP గ్రూప్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ వివాదం భారత కార్పొరేట్ రంగంలో అత్యంత గమనార్హమైన ప్రతిష్టంభనగా నిలిచింది.
టాటా ట్రస్టులు అనేవి సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ వంటి పలు దాతృత్వ సంస్థలను పర్యవేక్షించే గొడుగు సంస్థగా చెప్పవచ్చు. ఇవి 156 ఏళ్ల నాటి టాటా గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లో సుమారు 66 శాతం వాటాను కలిగి ఉన్నాయి. టాటా సన్స్‌కి 30 లిస్టెడ్ కంపెనీలు సహా దాదాపు 400 కంపెనీలు అనుబంధంగా ఉన్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో మెహ్లీ మిస్త్రీ వైదొలగడం, టాటా ట్రస్ట్‌లలోనే కాకుండా మొత్తం టాటా గ్రూప్ పాలనా వ్యవస్థలో ఒక కొత్త దిశను సూచిస్తోందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టాటా ట్రస్టులు తీసుకునే నిర్ణయాలు సాధారణంగా గ్రూప్ వ్యూహాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఈ మార్పు టాటా గ్రూప్ భవిష్యత్ దిశలో కీలక సంకేతంగా పరిగణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications