సాలిడ్ గా టాటా గ్రూపు ఫ్యూచర్ ప్లానింగ్.. AI పరివర్తన, క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్స్ పై చంద్రశేఖరన్ ఏమన్నారంటే..
Tata: టాటా గ్రూపు పేరు ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో గ్రూపుకి సంబంధించిన ప్రతి సమస్యను తనదైన శైలిలో పరిష్కరిస్తున్న టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యాపార వర్గాల్లో మంచి గుర్తింపు పొందారు. తాను "ఇండియా బుల్" అని, గ్రూపులోని ప్రతి కంపెనీ కృత్రిమ మేధస్సు వైపు మళ్లుతున్నట్లు చెప్పారు. ముంబైలో ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"రీఇన్వెంటింగ్ టాటా: రీడైరెక్టింగ్ ది కోలోసస్, కనెక్టింగ్ విత్ ది కన్స్యూమర్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్" గురించి చంద్రశేఖరన్ పలు విషయాలు పంచుకున్నారు. ఎయిర్ ఇండియా విస్తరణ, సూపర్ యాప్ సహా 5 కొత్త రంగాల్లోకి టాటా గ్రూపు ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. తమ అన్ని వ్యాపారాల్లో.. కృత్రిమ మేధస్సు, ఎనర్జీ, సరఫరా గొలుసు, టాలెంట్ అనే ఈ నాలుగు కోణాల్లో భారీ మార్పులు చేయాల్సి ఉందన్నారు.

"B2B లేదా B2Cతో సంబంధం లేకుండా ప్రతి కంపెనీలో AI పరివర్తన జరగాలి. మా సిబ్బందికి కొత్త సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వాలి, ఎందుకంటే కృత్రిమ మేధ ఉద్యోగాలపై తీవ్ర చూపుతుందని మేము భావిస్తున్నాము. దీనిని ఎదుర్కొనేందుకు నైపుణ్యాలు అవసరం. దీనికి భారీ నియంత్రణ సమస్య ఉంది. వివిధ ప్రభుత్వాలు పలు రకాలుగా స్పందిస్తున్నాయి. భారతదేశం దాని కోసం ఓ నియంత్రణ ఫ్రేమ్ వర్క్ రూపొందించేందుకు నాయకత్వం వహించాలి"అని చంద్రశేఖరన్ వెల్లడించారు.
ఆయన ఇండియా వృద్ధిపై సానుకూలంగా ఉన్నట్లు మరో ప్రకటనలో వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో టాటా గ్రూపు మూలధన పెట్టుబడులు 60-70 శాతం భారత్ లోనే ఉండనున్నట్లు పేర్కొన్నారు. 90 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో దాదాపు 70 బిలియన్ డాలర్ల వరకు ఇండియాలోనే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. టాటా గ్రూపు ఏడాదికేడాది దాదాపు 20 శాతం మేర వృద్ధి చెందుతుండగా.. దేశీయ వృద్ధి రేటు అధికంగా ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications