Air India విషయంలో ఎన్ చంద్రశేఖరన్ స్పెషల్ రిక్వెస్ట్.. ఎందుకంటే..?
Tata News: భారతదేశ విమానయాన చరిత్రలో ఎయిర్ ఇండియా పాత్ర చాలా కీలకమైనది. మెుదటగా దీనిని టాటాలు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత భారత ప్రభుత్వం చేతికి వచ్చింది. వరుస నష్టాలతో దానిని నడపలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయటంతో రతన్ టాటా తన మహారాజాను తిరిగి కొనుగోలు చేశారు.
టాటాల చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. కస్టమర్లు మెచ్చే ప్రపంచ స్థాయి సేవలను అందించేందుకు టాటా గ్రూప్ కార్యాచరణ చేపట్టింది. దీనికి తోడు వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియాపై మాట్లాడుతూ.. ప్రపంచాన్ని తలపించే ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి మాకు సమయం ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం కంపెనీలో మానవ వనరుల పరివర్తన, సాంకేతిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇంజనీరింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఫ్లీట్ మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్‌లైన్‌లో పని చేయాలనుకుంటున్న వారు లేదా తమ విమాన ప్రయాణ అనుభవాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తుల నుంచి ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా మెసేజ్ లు వస్తున్నాయని ముంబైలో జరిగిన బిటి మైండ్‌రష్ & బిటి బెస్ట్ సీఈవో అవార్డుల కార్యక్రమంలో వెల్లడించారు.
ఒక బిలియన్ ప్రజలు ఎయిర్ ఇండియా విజయవంతం కావాలని కోరుకుంటున్నారని చంద్రశేఖరన్ వెల్లడించారు. ప్రపంచంలోని ఏ గమ్యస్థానానికి అయినా విమానాలను నడపగల సామర్థ్యం ఎయిర్ ఇండియాకి ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం సంస్థ మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, లాంజ్ ల కొరతను చూస్తోందని. దీని పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రజలు కోరుకుంటున్న కొత్త ఎయిర్ ఇండియా ఆవిషృుతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications